తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి
నిజాం సర్కార్ బృహత్ ప్రణాళిక
1946లో అమెరికా పత్రిక మిషిగన్ మిర్రర్ కథనం
ఇదిగో సజీవ సాక్ష్యం
విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దక్కన్ సామ్రాజ్యాభివృద్ధికి రూపకల్పన
12,50,00,000 డాలర్లతో అత్యాధునిక ప్రణాళిక
50 లక్షల డాలర్లతో పారిశ్రామిక నగరం
రైళ్లు, పౌర రవాణా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు యత్నాలు
న్యూయార్క్ / హైదరాబాద్ ఏప్రిల్ 24 (జనంసాక్షి) :
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి నిజాం సర్కార్ బృహత్ ప్రణాళిక రచించింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలో, నిజాం వారసులో చెప్తున్నది కాదు. 1946, నవంబర్ 15న అమెరికాకు చెందిన పత్రిక మిషిగన్ మిర్రర్ ప్రచురించింది. ఆ కథనం క్లిప్పింగ్ ఇక్కడ చూడొచ్చు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దక్కన్ సామ్రాజ్యాభివృద్ధికి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూపకల్పన చేశారు. హైదరాబాద్ రాజ్య ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని భారత దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ఆయన కలలు కన్నారు. 12,50,00,000 డాలర్లతో అమెరికాలోని టెన్నిసీ వ్యాలీతో తులతూగే అత్యాధునిక ప్రణాళిక రూపొందించారు. బ్రిటిష్ ఇంజినీర్ కల్నల్ ఈడబ్ల్యూ స్లాటర్ ఆధ్వర్యంలో ఈ బృహత్ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజలు అన్నింటా అభివృద్ధి చెందడమే లక్ష్యమన్న ఉస్మాన్ అలీఖాన్ మాటలతో ప్రభావితమైన ఆయన చురుకుగా ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. సహచరుల సహకారంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసి నిజాం ముందుం చారు. అంతలోనే భారతదేశానికి స్వాతంత్రం రావడం, హైదరాబాద్ స్టేట్ స్వతంత్రంగానే ఉన్న స్థానికంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ ప్రణాళిక ముందుకు సాగలేకపోయింది. నిజాం రచించిన ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన అంశాలు ఇవీ… 12,50,00,000 డాలర్లతో రైలు వ్యవస్థ, పారిశ్రామికాభివృద్ధి, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో కూడిన రాజధాని నిర్మాణం. అందులో 50 లక్షల డాలర్లతో పారిశ్రామిక నగరం ఏర్పాటు. గోదావరి నదీ పరివాహక ప్రాంత అభివృద్ధికి ఏడేళ్లలోపు ప్రాజెక్టుల నిర్మాణం. అవి పూర్తయితే పది లక్షల మందికి ఉపాధి, ఇరవై లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని అంచానా వేశారు. కొత్తగా ఏర్పాటు చేసే రాజధాని నగరంలో 40,00,000 కిలోవాట్లు అంటే 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గోదావరినదిపై నిర్మించే మూడు ఆనకట్టల్లో మొదటిది 15 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం, మిగతా రెండు ఆనకట్టలు ఇరవై లక్షల ఎకరాల భూమికి సాగునీరందించేందుని సంకల్పించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన వెంటనే సాలీనా ఐదు లక్షల టన్నుల నాణ్యమైన ఉక్కు తయారు చేసే కర్మాగారం నిర్మించాలని, 650 మైళ్ల రైలు మార్గం నిర్మాణం, వస్త్ర పరిశ్రమ తదితర కర్మాగారాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక కింద ఖర్చు చేసే 12,50,00,000 డాలర్లలో నిజాం నవాబు సగం ఖర్చు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం అమలుకు నోచుకునే సమయంలో భారత్ స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించడం, తర్వాతి కాలంలో హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ ప్రణాళిక బుట్టదాఖలైంది. ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ గడ్డం కళాకాంతులు కోల్పోయింది. నిజాం తవ్విన గొలుసుకట్టు చెరువులు కానరాకుండా పోయాయి. వాటిపై రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. నిజాం స్థాపించిన కర్మాగారాలు మూతపడి లక్షలాది మంది రోడ్డున పడ్డారు. గోదావరినది నీటిలో ఇప్పటి మన వాటా నిజాం కాలంలో సంకల్పించిన ప్రాజెక్టులతో పోల్చితే ఎంత? పదిశాతం నీటిని కూడా తెలంగాణ వినియోగించుకోవడం లేదు. ఆ మూడు ఆనకట్టలు కట్టకుండా ఎవరు అడ్డుకున్నారో అందరికీ తెలిసిందే. 40 మెగా వాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన చోట నాలుగు మెగావాట్ల కేంద్రమైన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు గొంతు చించుకొని అరిచిన విషయం ఎప్పటికీ మర్చిపోలేం. నాటి నిజాం గుర్తుగా ఉన్న భారత దేశంలో మొట్టమొదటి థర్మల్ కేంద్రాన్ని కూల్చేసి ఆ సమాధులపై ప్రసాద్ ఐమాక్స్ కట్టింది నిజం కాదా? సొమ్ము మాదైతే సోకులు అనుభవించేది మీరా? అరవై ఏళ్లలో హైదరాబాద్‌లో కొత్తగా ఒక్క రైల్వే స్టేషన్ అయినా నిర్మించారా? కొత్తగా వేసిన రైలు మార్గాలెన్ని? ఆ రోజునే ఐదు లక్షల టన్నుల ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని నిజాం తలిస్తే ఇప్పటి సీమాంధ్ర సర్కారు బయ్యారంలోని ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించేందుకు కుట్రలు పన్నుతోంది. ఇన్ని చేసి తెలంగాణ ప్రాంతాన్ని తామే అభివృద్ధి చేశామని దబాయిస్తోంది. ఈ సీమాంధ్ర గుత్తాధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తే మనకు గోచీని లాక్కుంటారు. తెలంగాణ ప్రజలకు నిజాలెప్పుడో తెలుసు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది సీమాంధ్ర పెట్టుబడిదారులను గుడ్డిగా అనుసరిస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు మాత్రమే. వారు ఇప్పటికైనా మేల్కొంటారో? పాత పాటే పాడి ద్రోహులుగా మిగిలిపోతారో వారే తేల్చుకోవాలి.