తెలంగాణ సాధనే సార్‌కు నివాళి కోదండరామ్‌

ఘనంగా ఆచార్య జయశంకర్‌ వర్ధంతి
తెలంగాణ భవన్‌లో సిద్ధాంతకర్తకు జోహార్లు
హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే జయంశకర్‌ సార్‌కు నిజమైన నివాళి అని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని గన్‌పార్క్‌ వద్ద ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ చిత్రపటానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు పోరాటమే మార్గమని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ప్రతి గడప పోరుదారిన నడుస్తుందని తెలిపారు. సీమాంధ్ర పాలకులు అధికార బలంతో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని, ఆ దురంహకారానికి బదులు తీర్చుకొని తీరుతామని తీవ్రస్వరంతో హెచ్చరించారు. బతికినంత కాలం ప్రత్యేక రాష్ట్ర కోసం పోరాడిన జయశంకర్‌ సార్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్‌ జయశంకర్‌కు టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం జయశంకర్‌ సార్‌ రెండో వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మాట్లాడుతూ జయశంకర్‌ సారు ఆశయ సాధన అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేవరకు టీఆర్‌ఎస్‌ విశ్రమించదన్నారు. జయశంకర్‌ సారు మహనీయుడని కొనియాడారు. సార్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం నెలకొల్పాలని కోరారు. ఏమైనా ఇబ్బందులుంటే వాటిని టీఆర్‌ఎస్‌ పరిష్కరిస్తుందన్నారు. ప్రభుత్వం ముందుకు వస్తే కాంస్య విగ్రహాన్ని పార్టీ ఆధ్వర్యంలో సమకూరుస్తామని తెలిపారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవం తీసుకురావాలన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా తక్షణమే స్పందించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ సాధనతోనే ఆయనకు నివాళులర్పించిన వారం అవుతామన్నారు. జయశంకర్‌ సారులేని లోటు పూడ్చ లేనిదని, తనువంతా తెలంగాణ విముక్తి కోసం అర్పించిన మహోన్నత వ్యక్తి జయశంకర్‌ అని కొనియాడారు.