తెలంగాణ సాహిత్యం మనసు భాష

– ఎంపీ కవిత

నిజామాబాద్‌,ఆగష్టు 12(జనంసాక్షి):తెలంగాణ ధిక్కార స్వభావానికి ప్రతీక, మన భాష సహజ నుడికారాన్ని సగర్వంగా చాటిన మహనీయుడు కాళోజీ ఐతే ఈ గడ్డ అస్థిత్వాన్ని చాటి రాష్ట్ర ఆవశ్యకతను వివరించి మనల్ని కార్యోన్ముఖుల్ని చేసిన మహాత్ముడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌. ఈ వైతాళికులు ఇరువురిని స్మరించుకుంటూ జయశంకర్‌ సార్‌ జయంతి (ఆగస్ట్‌ 6), కాళోజీ జయంతి (సెప్టెంబర్‌ 9) లను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 31 చోట్ల కవి సమ్మేళనాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో నేడు నిజామాబాద్‌ లో జరిగిన కవి సమ్మేళనంలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పాల్గొన్నారు. ఇప్పటికి 10 జిల్లాలలో జరిగిన కవి సమ్మేళనంలో మొత్తం 650 కవులు పాల్గొన్నారని శ్రీమతి కవిత గారు ప్రకటించారు. తెలుగు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్న ఎంపీ కవిత మాట్లాడుతూ కవిత్వం హృదయ భాష అని సాహిత్యం జాతి సంపద అని అన్నారు. తెలంగాణం అనే అంశం పై జీవన విధానం, సంస్కృతి, కళలు, ఊరు, బాల్యం, , వృత్తులు, భాష, , ప్రకృతి వంటి ఉప అంశాలతో సాగుతున్న ఈ కవి సమ్మేళనాలతో జాతీయ స్థాయిలో తెలంగాణ కవిత్వం విశిష్టతను చాటుతున్నామన్నారు. గోల్కొండ కవుల సంచిక వెలువరించిన సురవరం స్ఫూర్తే మనకు దారిచూపే దివిటీ అన్నారు ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంపిక చేసిన 1000 మంది కవుల కవితలతో త్వరలోనే కవితా సంకలనం వెలువడుతుంది అన్నారు. పురస్కరించుకొని 31 జిల్లాల్లో 31 చోట్ల దాదాపు 1800 మంది కవులతో జరుగుతున్న ఈ బృహత్కార్యం ఇది అన్నారు.ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి కవిని శాలువా, మొమెంటో, ప్రశంసాపత్రంతో సన్మానించారు ఎంపీ కవిత. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, నగర మేయర్‌ శ్రీమతి సుజాత శ్రీశైలం, సాహిత్య విభాగం కన్వీనర్‌ కాంచనపల్లి, రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్‌, జిల్లా కన్వీనర్‌ అవంతీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.