తెలుగుదేశంలో తగ్గుతున్న నాయకత్వ పటిమ?
హైదరాబాద్, జూన్ 16 : ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ లో అంతర్మధనం మొదలైంది. కనీసం రెండు స్థానాలైనా చేజిక్కించుకోగలమని ఆశించిన ఆ పార్టీకి ఫలితాలు కొంతమేరకు నిరాశ కలిగించాయి. కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయినప్పటికీ చాలా చోట్ల గట్టి పోటినివ్వడమే గాక పది స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం ఆ పార్టీకి ఊరట కలిగించే అంశం. అంతే గాక నిస్తేజంగా ఉన్నపార్టీ శ్రేణులను ఉత్తేజపర్చడానికి ఈ ఎన్నికలు దోహద పడ్డాయని చెప్పక తప్పదు. మరో ముఖ్యమైన అంశం ఈ ఎన్నికల్లో పార్టీ ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం. రెండు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకన్నా తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగిందంటే ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న పట్టు పూర్తిగా జారి పోలేదని కూడా అర్ధమవుతోంది. అయితే పార్టీలో నాయకత్వ లేమి మాత్రం స్పష్టంగా కనబడుతోంది. పార్టీ విజయం కోసం అధినేత చంద్రబాబు ఒక్కరే కాలికి బలపం కట్టుకుని పోరాడడమే తప్ప ఆ స్ఫూర్తి ఎన్నికలు జరిగే జిల్లాల నాయకుల్లో గానీ, రాష్ట్ర నాయకుల్లో గానీ పూర్తిగా కనబడలేదు. కేవలం ఆయా ప్రాంతాలకు లేక హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమై ప్రకటనలను, మితిమీరిన ఆరోపణలు చేసేందుకే ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు కూడా వినిపించాయి. ఫలితాలు వెలుపడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ బోసిబోయి కనిపించింది. పార్టీ నాయకులు ఎవరూ అటువైపు వచ్చిన దాఖలాలుకూడా లేవు.ఎన్నికల అనంతరం విశ్లేషణలు, అంతర్మధనాలు పరిపాటిగా జరగుతున్నా వాటి సారాంశాన్ని భవిష్యత్తులో ఏ మేరకు అమలులో పెడుతున్నారన్నది ప్రశ్నార్ధకం. రాజకీయంగా కీలకమైన ఈ తరుణంలో, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదనే మాటలు గట్టిగా వినిపించడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ తన బలాన్ని కోల్పోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పారీ ్ట పట్ల వ్యతిరేకత ఉందన్న వాదనను పరకాల ఫలితాలు తోసిపుచ్చాయి. టిఆర్‌ఎస,్ వెఎస్సార్‌సిపి పోటాపోటీగా పోరాడిన పరకాలలో తెలుగుదేశం పార్టీ మూడోస్థానంలో నిలిచింది. అంటే తమ వాదనను కూడా ప్రజలు ఆలకించి ఆదరిస్తున్నారన్న ధైర్యం పార్టీ శ్రేణుల్లో వచ్చింది. అయితే జగన్ ప్రభావంతో సీమాంధ్రలో పూర్తిగా కాంగ్రెస్ గల్లంతై తాము లాభపడతామని భావించిన చంద్రబాబుకు ఈ ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. పైగా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలాన్ని కోల్పోలేదని ఫలితాలు నిరూపించాయి. ప్రభుత్వ వ్యతిరేకత, వైఎస్ జగన్ చీలికతో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని భావించారు. కానీ వారి అంచనాలు తారుమారయ్యాయి. కారణం .. పార్టీ నాయకత్వ మంటే చంద్రబాబే అనే రీతిలో తెలుగుదేశం నడుస్తోంది. చంద్రబాబు పార్టీ లోపాలను సరైన పద్దతిలో విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. అన్ని స్థాయిల్లో నాయకత్వ లోపాన్ని సరిదిద్ది పార్టీని సరైన దిశలో పెట్టకపోతే పార్టీ నుంచి ఒక్కరొక్కరే నాయకులు జారిపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.
రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను వదిలేసిన కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న కోస్తాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోయింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో తెలుగుదేశం గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమిని తప్పించుకోలేకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఉప ఎన్నికలు జరిగిన 18 స్థానాల్లో పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పది స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతను, వైఎస్ జగన్ అవినీతిని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఇందుకు నాయకత్వ లోపం, ఉన్న నాయకుల్లో ఉదాసీనత కూడా కారణాలుగా చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో గెలిచినా ఒక్కటే ఓడినా ఒక్కటే. గెలిస్తే బోనస్, ఓడినా నో లాస్ అనే ఆలోచనతో కొందరు నాయకులు వ్యవహరించడం కూడా పార్టీకి చేటు తెచ్చింది. అందువల్లే గెలిచే అవకాశాలున్న స్థానాల్లో కూడా పార్టీ ఓటమి చవి చూసింది.దీనికి తోడు క్రమంగా ఒక్కో సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి దూరమవుతుందనే అభిప్రాయం కూడా ఉంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకుని క్రమంగా బలం పుంజుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీలో నాయకత్వ పటిమ క్రమంగా తగ్గుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.ఇప్పటి. నాయకత్వం పార్టీని సరైన దిశలో పెట్టకపోతే ఒక్కరొక్కరే తప్పకునే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.ఇప్పటికైనా నాయకత్వ లోపాలను సవరించుకోకుంటే పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు.