తెలుగుపాటకు పరిమళం అద్దిన సినారె

( మహాకవి జయంతి సందర్భంగా నివాళి )

కరీంనగర్‌,జూలై29(జనంసాక్షి ): తెలుగు సినిమా కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహాకవి సి.నారాయణ రెడ్డి. ఆయన ఎన్నో సినిమాలకు అనేక వేల పాటలు రాసారు. కృష్ణశాస్త్రి తరవాత భావుకవితను ప్రస్ఫుటించిన మహామేధావి మన సినారె. తన మధుర కవిత్వంతో మత్తెక్కించిన మహాకవి సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి. తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు సినారె అనే మూడక్షరాలు. తన సాహిత్యంతో అటు పండుతుడికి, ఇటు పామరుడికి దగ్గరైన సాహితీ వేత్త..ఎవరంటే అది ఖచ్చితంగా సినారే అని చెప్పాల్సిందే. తెలుగువాడికి సుప్రభాతం ఆయన పాట. విప్లవ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని ఏలుతున్న కాలంలో ఆయన అందుకు విరుద్దంగా తనదైన ముద్రను వేస్తూ వెళ్లారు. విశ్వనాథ సత్యనారాయణ సంప్రదాయ సాహిత్యానికి పట్టం కడితే, ఆధునిక భావజాలాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు కవిత్వంలో సినారె తన ప్రాశస్త్యాన్ని చాటుకున్నారు. కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జులై 29, 1931లో సి నారాయణ రెడ్డి జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్‌ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు.వందలాది సినిమాలకు వేల సంఖ్యలో సినీ గీతాలు రాశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా విడుదలైన గులేబకావళి కథ సినిమాలో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటతో సినీరంగ ప్రవేశం చేసిన సినారె ఆపైన సుమారు మూడు వేలకు పైగా పాటలు రచించి సినిమా ప్రేక్షకులను తన కవితా మాధుర్యంతో మైమరిపించారు. చిలిపి కనుల తీయని చెలికాడా..అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు, జాతిని నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు. అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అద్దమున్నదా.. కంటేనే అమ్మ అని అంటే ఎలా.. ఓ ముత్యాల కొమ్మా…ఓ రాములమ్మా.. తదితర తెలుగు సినిమా పాటలు సినారె ప్రతిభకు తార్కాణాలు. సినిమా పాటల్లో సైతం
సాహిత్య విలువలకు పట్టం కట్టి తెలుగు సినీ సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు.

తాజావార్తలు