తేదేపా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
మచిలీపట్నం: కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీరు తక్షణం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా తేదేపా ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అద్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ కొనకల్ల నారాయణరావు, శాసనసభ్యులు అంబటి బ్రహ్మణయ్య, తంగిరాల ప్రభాకరావు, శ్రీరాం తాతయ్య, దాసరి బాలవర్థనరావు, మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ తదితరులు మాట్లాడుతూ.. రైతు సంక్షేమంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. 150ఏళ్ల చరిక్రత ఉన్న కృష్ణాడెల్టా హక్కుల పరిరక్షణ, రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి ఎప్పుడు నీరు విడుదల చేస్తారో అధికారులు స్పష్టం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యక్తి గత పూచీకత్తుపై విడిచిపెట్టారు.