తొలిరోజే తెలం’గానం’
తాడో పేడో దిశగా టీ ఎంపీలు
లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ
‘కోల్’గేట్, అత్యాచారాలపై విపక్షాల నిరసన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 (జనంసాక్షి) :
పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాల తొలిరోజే తెలంగానం హోరెత్తింది. టీ కాంగ్రెస్ ఎంపీలు ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరిస్తూ ఆందోళనకు దిగారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానంతో ప్రత్యేక రాష్ట్రంలో తాడో పేడో తేల్చుకునే దిశగానే ఎంపీలు అడుగులు వేశారు. సోమవారం ప్రారంభమైన మలి విడత బడ్జెట్ సమావేశాల్లో వివిధ అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంతో తొలి రోజే ఉభయ సభలు దద్దరిల్లాయి. మహిళలపై అత్యాచారాలు, బొగ్గు కుంభకోణంపై జేపీసీ నివేదిక, 2జీ స్పెక్టమ్ర్, తెలంగాణ నినాదాలతో మార్మోగాయి. ఆయా అంశాలపై చర్చకు పట్టుబట్టడంతో సభలు స్తంభించాయి. ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను పార్లమెంట్ తీవ్రంగా ఖండించింది. దక్షిణ సూడాన్‌లో భారత సైనికుల హత్య, బోస్టన్ బాంబు పేలుళ్ల మృతులకు నివాళులర్పించింది. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్ మృతికి సంతాపం ప్రకటించింది. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యంతో పాటు వివిధ అంశాలపై చర్చించాలంటూ విపక్షాలు సభను స్తంభింపజేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ విూరాకుమార్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకు ముందు సభ ఇటీవల మృతి చెందిన పలువురికి నివాళులర్పించింది. ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనను సభ తీవ్రంగా ఖండించింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. సమాజం, ప్రజల్లో మార్పు వస్తేనే ఇలాంటివి పునరావృతం కావని స్పీకర్ విూరాకుమార్ పేర్కొన్నారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభ ఎక్కువసేపు సాగలేదు. తెలంగాణ నినాదాలతో టీ-ఎంపీలు, బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలదాడిని నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ వెల్‌లోకి దూసుకెళ్లారు. మరోవైపు, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై చర్చించాలంటూ బీజేపీ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలన్న నినాదాలతో సభ ¬రెత్తింది. అయినా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు యత్నించారు. కానీ సభలో గందరగళోం నెలకొనడంతో సభను రెండు గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభ కూడా ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. మహిళలపై అఘాయిత్యాలు, బొగ్గు కుంభకోణం, 2జీ స్పెక్టమ్ర్ స్కాం తదితర అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే, విపక్షాల ఆందోళనను చైర్మన్ హవిూద్ అన్సారీ తోసిపుచ్చారు. ఆయా అంశాలపై చర్చించేందుకు సమయం కేటాయిస్తానని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మధ్యాహ్నం చర్చిద్దామని ప్రతిపాదించారు. అయితే, సభ్యులు వినకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభ ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనను ఖండించింది. దక్షిణ సూడాన్‌లో భారత సైనికుల హత్య, దాడి ఘటనలను ఖండించింది. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్ మృతికి సంతాపం ప్రకంటించింది. బోస్టన్ బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారికి సభ నివాళులర్పించింది. తిరిగి సభ ప్రారంభమైన అనంతరం చైర్మన్ విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు యత్నించగా.. విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, బొగ్గు కేటాయింపులపై చర్చ జరపాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే, బొగ్గు కుంభకోణంలో సీబీఐ పాత్రపై చర్చకు అన్సారీ అనుమతించారు. కానీ, బీజేపీ, వామపక్షాలు, బీఎస్పీ సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి నినాదాలు చేయడంతో సభను వాయిదా వేశారు.