తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన‌ రాష్ట్రపతి

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): రాష్ట్రపతి హోదాలో తన దగ్గరికి వచ్చిన తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఓ బర్రె దొంగతనం కేసులో ఐదుగురు చిన్నారులతోపాటు ఒకే కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా అగ్నికి ఆహుతి చేసిన వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. 2006లో బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్‌పూర్ బ్లాక్‌కు చెందిన జగత్ రాయ్ అనే వ్యక్తి విజేంద్ర మహతోపాటు అతని కుటుంబంలోని ఆరుగురిని కిరాతంగా హత్య చేశాడు.తన బర్రెను దొంగతనం చేశారంటూ జగత్‌రాయ్‌పై మహతో కేసు పెట్టడంతో దానిని మనసులో పెట్టుకొని ఈ హత్యలకు పాల్పడ్డాడు. మహతో ఇంటికి జగత్ రాయ్ నిప్పంటించడంతో ఇంట్లోని వాళ్లంతా అగ్నికి ఆహుతయ్యారు. తీవ్ర గాయాల పాలైన మహతో కొన్ని నెలల చికిత్స తర్వాత చనిపోయాడు. స్థానిక కోర్టు జగత్ రాయ్‌కు మరణశిక్ష విధించగా.. 2013లో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థించాయి. ఆ తర్వాత జగత్ రాయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపించారు.గతేడాది జులై 12న దీనిపై హోంశాఖ అభిప్రాయాన్ని రాష్ట్రపతి కార్యాలయం కోరింది. 2018, ఏప్రిల్ 23న రాష్ట్రపతి ఈ పిటిషన్‌ను తిరస్కరించారు. కోవింద్ రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన తొలి క్షమాభిక్ష కేసు ఇది. రాజ్యాంగంలో 72వ ఆర్టికల్ ప్రకారం కోర్టు మరణశిక్ష విధించినా క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.