త్వరలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ

4

– అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):తెలంగాణ ఎన్నారై పాలసీ రూపకల్పన విూద ఎన్నారై శాఖ మంత్రి కె.తారక రామారావు దృష్టి సారించారు. తెలంగాణలోని యువత, ముఖ్యంగా గల్ఫ్‌ ఉపాధి వంటి సమస్యల కేంద్రంగా నూతన ఎన్నారై పాలసీ రూపొందించేందుకు మంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాల్లోని పాలసీలను అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నారై పాలసీలను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌.. అందులోని ప్రధానమైన అంశాలను తెలంగాణ పాలసీలో స్వీకరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.తెలంగాణలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే యువతకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పాలసీ ఉండబోతున్నది. ఈ పాలసీ రూపకల్పన కోసం మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఎన్నారై సంఘాలు, ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లోని ఎన్నారైల కోసం పనిచేస్తున్న సంస్ధలతో ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నారు. కార్మిక శాఖతో పాటు మరికొన్ని సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను సైతం ఈ సమావేశానికి హాజరుకావాలని మంత్రి ఆదేశించారు.విదేశాలకు వెళ్లే యువత మోసపోకుండా ఉండేలా పాలసీని రూపొందించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విదేశాల్లో ప్రమాదాలకు గురైన వారికి, మరణించిన వారికి అందాల్సిన సహాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నారైల నుంచి వచ్చే పెట్టుబడులు, ఇతర భాగస్వామ్యాల స్వీకరణకు ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థ పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. వలస కార్మికుల సంక్షేమం కోసం స్వదేశంలో పని చేస్తున్న పలువురితో పాటు, సంఘాలను ఆహ్వానించనున్నారు. వీరు గత కొన్ని ఏళ్లుగా గత ప్రభుత్వాలకు ఇస్తున్న సలహాలను, సూచనలను స్వీకరించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందరితో కలిసి దేశంలోనే అద్భుతమైన పాలసీని రూపొందిస్తామన్నారు. ఈ మేరకు పాలసీ డ్రాఫ్ట్‌ ని రూపొందించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలను స్వీకరించి, సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.