త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి
– మూడో విడత మిషన్ కాకతీయపై మంత్రి హరీశ్ సమీక్ష
హైదరాబాద్,మే30(జనంసాక్షి): మిషన్ కాకతీయ మూడో దశ పనుల టెండర్ల పక్రియ డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశాలు జారీచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, భూసేకరణ, మిషన్ కాకతీయ పనులపై మంత్రి కలెక్టర్లతో సవిూక్ష నిర్వహించారు. టెండర్ల పక్రియలో పారదర్శకత పాటించి సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించారు. అంచనాలు మొదలుకుని మంజూరు వరకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదార్ల నుంచి స్పందన లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన లేని రూ.5లక్షలలోపు పనులను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని ఆదేశించారు.అమరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి మరింత కష్టపడాలని ఇంజినీర్లకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రా నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ తెదేపా నాయకులు ఆంధ్రా పాలకులకు వంత పాడి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన హంద్రీనీవా, పట్టిసీమ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులిచ్చిన ప్రాజెక్టులనే తాము ఇప్పుడు కడుతున్నట్లు చెప్పారు. రాజకీయాల కోసం ప్రాజెక్టులు అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.