థానే పోలీస్‌ స్టేషన్‌కు అర్బాజ్‌ఖాన్‌

– ఐపీఎల్‌లో అర్బాజ్‌ఖాన్‌పై బెట్టింగ్‌ ఆరోపణలు
– శుక్రవారం సమన్లు జారీ చేసిన థానే కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు
థానే, జూన్‌2(జ‌నం సాక్షి) : ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో హీరో అర్బాజ్‌ఖాన్‌ శనివారం థానే యాంటీ ఎక్స్‌టార్షన్‌ సెల్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆ కేసులో శుక్రవారం ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోట్లు కురిపిస్తూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో బెట్టింగ్‌ మరోమారు కలకలం రేపింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ బెట్టింగ్‌లో పాలుపంచుకున్నట్లు తేలడంతో థానే కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్‌ 11వ సీజన్‌లో బుకీలతో కలిసి అర్బాజ్‌ బెట్టింగ్‌ పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బెట్టింగ్‌లో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ బుకీ సోను జలాన్‌ విచారిస్తున్న క్రమంలో అర్బాజ్‌ పేరు బయటికి వచ్చిందని అందుకే సమన్లు జారీ చేశామని యాంటీ ఎక్స్‌టార్షన్‌ సెల్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌శర్మ పేర్కొన్నాడు. బెట్టింగ్‌ కారణంగా రూ.2.8 కోట్లు అర్బాజ్‌ నష్టపోయినట్లు టైమ్స్‌ నౌ కథనంగా పేర్కొంది. ఈ విషయమై అర్బాజ్‌ తండ్రి సలీమ్‌ఖాన్‌ను ఫోన్లో సంప్రదించినా ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలిసింది. బెట్టింగ్‌కు ప్రధానంగా కేంద్రంగా భావిస్తున్న దోంబివిలీలో థానే కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు గత నెల 16న చేసిన దాడిలో పలువురిని అరెస్ట్‌ చేశారు. అయితే బెట్టింగ్‌లో కీలకంగా వ్యవహరించిన సోను జలాన్‌..దావూద్‌ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీతో కలిసి భారత్‌లోనే కాకుండా చాలా దేశాల్లో బెట్టింగ్‌ దందా చేసినట్లు బయటపడింది. ఇలాంటి అనైతిక కార్యాకలాపాల ద్వారా సోను యేడాదికి
దాదాపు రూ.100 కోట్లు సంపాదించినట్లు పోలీస్‌ అధికారి ప్రదీప్‌ పేర్కొన్నాడు. విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు.