థియేటర్లలో ఐదో ఆటకు అనుమతులు
లాక్డౌన్ కాలంలో కరెంట్ బిల్లుల మాఫీ
సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించిన ప్రభుత్వం
సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళతామన్న మంత్రి తలసాని
హైదరాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినిమా షూటింగ్‌ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ సమయంలో థియేటర్‌లు మూసివేసి ఉన్న కారణంగా విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తులను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. నగరంలోని బీఆర్‌కేఆర్ భవన్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తలసాని అధ్యక్షతన మంగళవారం సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వచ్చే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. 5వ ఆట ప్రదర్శనకు కూడా అనుమతించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో5 వ ఆట ప్రదర్శనకు అనుమతుల మంజూరు, లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిద రకాల పన్నులను రద్దు చేయటం, ఇతర తదితర అంశాలపై చర్చించారు. 5వ ఆటను ప్రదర్శించడానికి, ఆన్‌లైన్ టికెటింగ్,ట్యాక్స్, కరెంట్ బిల్లులు ఈ అంశాల పై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఇప్పటికే షూటింగ్‌లకు సింగిల్ విండో సిస్టం ద్వారా షూటింగ్ అనుమతులు ఇస్తున్నాం. హైదరాబాద్ సినిమా హబ్‌గా తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ సమావేశంలో జరిగిన అంశాల పై సీఎం కేసీఆర్‌తో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తాం. అలాగే మరో సమావేశం తరువాత వాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాల క్లారిటీ వస్తుంది. అలాగే 5వ షోకు సంబంధించిన అనుమతిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. లాక్ డౌన్ సమయంలో కరెంట్ చార్జీల మాఫీపై చర్చించాం. వచ్చే సమావేశంలో ఎగ్జిబిటర్స్‌కు ప్రోత్సహకాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. థియేటర్స్ కరెంట్ బిల్లుల మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరామని, అందుకు ప్రభుత్వం అంగీకరించిందని.. మిగతా సమస్యలపై కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని ఎగ్జిబిటర్ సి.కళ్యాణ్ తెలిపారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.