థియేటర్లలో మార్నింగ్ షోలు రద్దు
ఐమ్యాక్స్ వద్ద ప్రేక్షకుల ఆందోళన
హైదరాబాద్,డిసెంబర్7(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో సినిమాహాళ్లు కూడా మార్నింగ్ షో రద్దు చేశాయి. అయితే ఈ షోకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వరాఉ థియేటర్లకు వచ్చి వెనుదిరగాల్సి వచ్చింది. ఓటు వేసేందుకు కొందరు ఊళ్లకు వెళ్లిపోగా.. మరికొందరు తమకు కలిసొచ్చిన సెలవు రోజును వినియోగించుకునేందుకు థియేటర్ పయనమయ్యారు. ఇలా నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్‌కు చేరుకున్న కొందరు సినీ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలింగ్ నేపథ్యంలో థియేటర్ నిర్వాహకులు శుక్రవారం ఉదయం షోను ప్రదర్శించలేదు. దీంతో ఈ రోజు ‘2.ఓ’ సినిమా కోసం టికెట్లు పొందిన ప్రేక్షకులు థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు మళ్లీ ఎప్పుడు సినిమాకు అవకాశం ఇస్తారని నిలదీసారు.