దత్తత పాఠశాలలకు 12 లక్షల ఉపకరణాలు
పోలీస్ శాఖ వినూత్న నిర్ణయం
విజయనగరం,జూలై6(జనం సాక్షి): పోలీసులు దత్తత తీసుకున్న 10 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోలీస్ పరేడ్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ దాదాపుగా 12 లక్షల నిధులతో ఆయా పాఠశాలలకు ఉపయోగపడే ఉపకరణాలు అందజేసింది. జిల్లా ఎస్పీ పాల్ రాజ్ మాట్లాడుతూ…పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామన్నారు. ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంచేందుకు, ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకొచ్చేందుకు వివిధ రకాల సమాజ సేవ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ విద్యా పాఠశాలలను బలోపేతం చేసేందుకు వివిధ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ ఉన్న విద్యార్థులకు పోలీసు విధులపై అవగాహన కల్పిస్తున్నామని, ఆత్మ రక్షణ, అఘాయిత్యాల నుండి బాలికలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలపై అవగాహన
కల్పిస్తున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తయారుచేయలన్న ఉదేశంతో ఈ ఉపకరణాలు పంపిణీ చేశామని, ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులను అవసరమైనపుడు వారి ఇష్టానికి అనుగుణంగా ఉపయోగిస్తామని తెలిపారు. అనంతరం.. జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ…పోలీస్ సేవాగుణంలో పోటీపడడం చాలా అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు, వారికి అవసరమైన బుక్స్, ఉపకరణాలు అందజేయడం విశేషమన్నారు. 10 కోట్ల నిధులతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని విస్తృత్తంగా నిర్వహించి ప్రజలలో పోలీస్ వ్యవస్థపై గౌరవం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ పాల్ రాజ్, ఓఎస్డీ విక్రాంత్ పాటిల్, పిటిసి ప్రిన్సిపాల్ రాజా శికమని, డీఈవో నాగమణిలు పాల్గొన్నారు.