దమనకాండ బాధ్యులను సస్పెండ్‌ చేయండి : విజయశాంతి

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : తెలంగాణవాదులపై కక్ష ఎందుకో అర్ధం కావడం లేదని ఎంపి విజయశాంతి అన్నారు. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బుధవారంనాడు ఆమె కలుసుకున్నారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా జరిగిన దమనకాండకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వెలుపలకు వచ్చిన విజయశాంతి విలేకరులతో మాట్లాడారు. ఆది నుంచి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక కుట్రలు సాగుతున్నాయన్నారు. వాటన్నింటిని అధిగమించి ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చామన్నారు. ఓర్పుతో, సంయమనంతో, సహనంతో వ్యవహరిస్తున్న తెలంగాణవాదులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. సీమాంధ్ర నేతలకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి రెడ్‌ కార్పెట్‌ పరు స్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరానని చెప్పారు. మైనారిటీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని కోరానన్నారు. ఇప్పటికైనా తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయాలని వైఎస్‌ఆర్‌సిపిని కోరుతున్నానని అన్నారు. తెలంగాణపై తమ వైఖరిని స్పష్టం చేయని వారిని తెలంగాణ గడ్డపై అడుగిడనీయబోమని స్పష్టం చేశారు.

తాజావార్తలు