దమ్ముంటే సవాల్‌ స్వీకరించి ఎన్నికలకు రండి: జోగు

ఆదిలాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): రాష్ట్రం అన్నదాతల సంక్షేమ రాజ్యంగా మారిందని అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. అనేక పథకాల అమలే ఇందుకు నిదర్శనమని అన్నారు. వీటిని పట్టించుకోకుండా కాంగ్రెస్‌,బిజెపిలు తమదే అధికారమని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే సిఎం కెసిఆర్‌ విసిరిన సవాల్‌కు ముందుకు వచ్చి ఎన్నికలకు సిద్దపడాలన్నారు.భూసర్వే, భూసార పరీక్షలు, రైతుబంధు, రైతుకు జీవితబీమా, ఉచిత విద్యుత్‌ లాంటి అద్భుత పథకాలతో రైతు సంక్షేమ రాజ్యంగా తెలంగాన వర్ధిల్లుతున్నదని, ఇతర రాష్ట్రాలు ఈ పథకాలు చూసి ఆశ్చర్య పోతున్నాయని అభివర్ణించారు. రైతుపండించిన పంటలన్నీ ప్రభుత్వం మద్దతు ధరకే గ్రామాలకే వచ్చి కొంటుంద ని వెల్లడించారు.సీఎం కేసీఆర్‌ రైతును రాజును చేసే దిశగా రాష్ట్రం లో 2700 ఏఈవో పోస్టులు భర్తీచేశారని , 5000 ఎకరాలకు ఒక ఏఈవో, రైతుభవనం ఉంటుందని వివరించారు. రైతులు సాంకేతికత ఉపయోగించుకుంటూ అధికారుల సూచనలు తీసుకుంటూ దిగుబడులు సాధించాలన్నారు. సర్కారు వైద్యశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటు దవాఖానలు పేదల రక్తం పీలుస్తాయన్నారు. కేసీఆర్‌ కిట్‌ తదితరాలతో ప్రసవాల సంఖ్య పెరిగిందని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌, కిషన్‌రెడ్డి ఉత్తరకుమారులని, వారిని త్వరలో మానసిక వైద్యశాలల్లో చేరిస్తే బాగుంటుందన్నారు.

తాజావార్తలు