దయచేసి ప్రాణాలు తీసుకోకండి

విూకు సాయం చేయడానికి నేనున్నాను

సినీ నటుడు విశాల్‌

చెన్నై,జూన్‌6(జ‌నం సాక్షి): నీట్‌ పరీక్షలో ఫెయిల్‌ అయినందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులపై నటుడు విశాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కోసం ప్రాణాలు తీసుకోవద్దని వేడుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ సోషల్‌విూడియాలో ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన జస్లిన్‌ కౌర్‌ అనే యువతి నీట్‌ పరీక్షలో విఫలమై ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. ఈ వార్త నన్ను కలచివేసింది. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కానీ విద్యార్థులు ఇలా ప్రాణాలు తీసుకుంటూపోతే వారి కలలు కలలుగానే మిగిలిపోతాయి. పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధమైనట్లే నీట్‌ పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. ఓడిపోయాం కదా అని ఆశలు వదులుకోవద్దు. విూకు సాయం చేయడానికి నేనున్నాను. నీట్‌ ఒక్కటే శాశ్వత పరీక్ష అయితే..విద్యార్థులకు బాగా చదవడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించాలి. కోచింగ్‌, సైకలాజికల్‌ శిక్షణ వంటివి ఏర్పాటుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లేకపోతే పేద విద్యార్థులు వైద్య విద్య గురించి ఇక ఆలోచించలేరు’ అని పేర్కొన్నారు విశాల్‌. అబిడ్స్‌కు చెందిన జస్లిన్‌ కౌర్‌ అనే విద్యార్థిని నీట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అవడంతో భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. జస్లిన్‌ కౌర్‌ భవనం ఎక్కడం, పై అంతస్తు నుంచి దూకడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డవడంతో ఈ ఘటన కాస్తా వైరల్‌గా మారింది.