దర్గాను దర్శించుకున్న తృప్తి

4

– సమానత్వం కోసమే పోరాటం: దేశాయ్‌

ముంబయి,మే12(జనంసాక్షి):  ఆలయాల్లో మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న భూమాత బ్రిగేడ్‌ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్‌ గురువారం ముంబయిలోని హజీ అలీ దర్గాకు వెళ్లారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ బందోబస్తు నడుమ గురువారం ఉదయం తృప్తి దర్గాలో ప్రార్థనలు చేశారు. అయితే దర్గా గర్భాలయంలోకి తృప్తి ప్రవేశించలేదు. త్వరలోనే దర్గా గర్భాలయంలోకి వెళ్లేందుకు మహిళలకు అనుమతి వచ్చేలా తాను ప్రార్థనలు చేసినట్లు తృప్తి తెలిపారు. దర్గాకు వచ్చేందుకు తమకు పోలీసులు సాయం చేశారని తెలిపారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. తృప్తి ప్రవేశంతో ఈ రోజు దర్గాను మూసివేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. శని సింగ్నాపూర్‌, త్రయంబకేశ్వర్‌ ఆలయాల్లో మహిళల ప్రవేశాలకు తృప్తి పోరాటం చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల పాటు ఆమె చేసిన పోరాటానికి ఫలితం లభించి.. ఆలయాల్లోకి మహిళలు రావడాన్ని అడ్డుకోకూడదని బాంబే హైకోర్టు తీర్పుచెప్పింది. దీంతో కొన్ని షరతుల మధ్య ఆయా ఆలయ ట్రస్టీలు మహిళలను అనుమతించారు. అనంతరం దర్గాలోకి కూడా మహిళలను అనుమతించాలని కోరారు. గత నెలలో మరికొందరు మహిళా కార్యకర్తలతో కలిసి.. తృప్తి దర్గాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. తాజాగా పోలీసుల సాయంతో తృప్తి దర్గాలోకి వెళ్లారు.