దళితబందు తరహాలో గిరిజన, బిసి బందు అమలు చేయాలి

ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పథకం ఉండాలి: బండి సంజయ్‌
కరీంనగర్‌,అగస్టు16(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు, బీసీ బంధు కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల కోసం బీజేపీ చేపట్టబోయే దరఖాస్తుల ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పదాదికారుల సమావేశానికి హాజరైన బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌కు దళితులకన్నా వారి ఓట్లపైనే గురి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు గుప్పించారు. హుజురాబాద్‌ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హావిూ కూడా అమలు అవని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి పథకం అటకెక్కిందని, రైతు ఋణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన నిధులిచ్చినా కూడా తెలంగాణలో ఎక్కడా కనిపించటం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజల కోసం బీజేపీ చేపట్టబోయే దరఖాస్తు ఉద్యమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తేనే సీఎం కేసీర్‌ ప్రజల్లోకి వస్తాడని, రాష్ట్రంలో దళిత
బంధు అందరికీ రావాలని ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. హుజురాబాద్‌లో ప్రారంభిస్తున్న దళిత బంధు తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఇవ్వాలని, బీసీ బంధు ప్రారంభించాలని బండి సంజయ్‌
డిమాండ్‌ చేశారు.