దళితబంధు ఓ అత్యున్నత పథకం

దళితుల పురోగతికి కెసిఆర్‌ ప్రణాళిక అన్న హరీష్‌
దళితులను అర్థంచేసుకున్నది కెసిఆర్‌ మాత్రమే అన్న పల్లా
హుజురాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శినికతకు ఈ పథకం నిదర్శనం అని అన్నారు. ఆయన ఈ మేరకు ట్విట్‌ చేశారు. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని ఆయన వెల్లడిరచారు. రూ. 10లక్షల ఆర్ధిక సాయమే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోటా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం కావడం తెలంగాణాకే గర్వకారణం అని హరీశ్‌ రావు ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచారు. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రారంభమైన ఈ సామాజిక న్యాయ విప్లవం మునుముందుకే సాగుతుందని ఆయన పేర్కొన్నారు. దళితుల సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరేనని, దళితబంధు పథకం ద్వారా భారతదేశ దళితుల బతుకులు బాగుపడతాయని, అటువంటి బృహత్తర పథకానికి కేసీఆర్‌ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. దళిత బంధు పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాలపల్లిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు అంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను ఓటుబ్యాంక్‌ గా కాకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరే అని ఆయన పేర్కొన్నారు. రెండు పంటలకు రైతు బంధు పథకం ద్వారా పదివేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్‌ ప్రభుత్వమేనని ఆయన వెల్లడిరచారు. ఈ పథకాన్ని యునెస్కోతోపాటు దేశం యావత్తు ప్రసంశిస్తున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఇదిలావుంటే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితుల సంబురాలు ఆకాశన్నంటాయి. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితుల్లో సరికొత్త స్ఫూర్తిని రగిలిస్తోంది.ఆర్థిక పునర్జీవనాన్ని కల్పించి దళిత సోదరులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసేందుకు సీఎం కేసీఆర్‌ దళిత యజ్ఞానికి పూనుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించడంతో దళితవాడల్లో సంబురాలు అంబరన్నంటాయి. అందమైన రంగవల్లులు, డప్పుచప్పుళ్లు, ఆటపాటలతో తెలంగాణలోని దళిత లోగిళ్లు సరికొత్త ఉషోదయంతో వెలుగులు పంచుకుంటున్నాయి.