దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలి
జిల్లా షెడ్యూల్డ్ కులాలు తెగలు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపి పోతుగంటి రాములు
ప్రతినెల 30వ తారీఖున పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నాం :కలెక్టర్ శ్రీహర్ష
జిల్లాలో హత్య కేసు కిడ్నాప్, రేప్, హర్ట్, తదితర వాటిపై 44 కేసులు నమోదు చేశాం : ఎస్పీ రంజన్ రతన్ కుమార్
జిల్లాలో కుల వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరు కార్చకుండా పోలీసు అధికారులు విచారణ చేయండి : ఎమ్మెల్యే అబ్రహం
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 12 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళితులకు కల్పించిన రాజ్యాంగ హక్కులను ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలని నాగర్ కర్నూల్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు రాములు అన్నారు.
మంగళవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాలు తెగలు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి రాములు అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహాంలతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ…
సమాజంలో అభివృద్ధి అనేక విధాలా ఉందని అన్ని వర్గాలు అభివృద్ధి చెందిన నాడే వారికి ఆత్మవిశ్వాసం కలుగుతుందని అన్నారు. దళిత సాధికారత కొరకు ప్రతి మూడు మాసాల కు జరిగే సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు.సమావేశం గురించి అందరికీ ముందస్తుగా సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పూర్వాపరాలు తెలుసుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. జిల్లాలో ఇంకా కొన్ని గ్రామాలలో కుల వివక్ష ఉందని, అటువంటి గ్రామాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు సందర్శించి కుల వివక్ష నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతినెల 30 తేదీన పౌర హక్కుల దినోత్సవం గ్రామ కూడలిలోనే నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని అన్నారు. ముఖ్యంగా పోలీసులు,రెవిన్యూ గ్రామ ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీని జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు గురించిఅడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు అయ్యాక వారికి ఎక్స్ గ్రేషియా అందేలా చూడాలని ఎంపీ ఆదేశించారు. మళ్ళీ జరిగే సమావేశంలో ఏజెండాలోని అంశాలు తెలుగులో ఉండాలని ఆయన తెలిపారు గ్రామాలలో అధికారులు ఇరువర్గాలు కలిసి సాధ్యమైనంత వరకు రాజీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ఎంపీ తెలిపారు. గ్రామాలలో జరిగే పౌర హక్కుల దినోత్సవం రోజున పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను గమనించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అనేక గ్రామాలలో మార్పు వచ్చిందని ఇంకా కొన్ని గ్రామాలలో అంటరానితనం దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నదని, వాటిని నిరోధించేందుకు పౌర హక్కుల దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అట్రాసిటీ కేసులు నమోదు చేయని పక్షంలో తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీ కోరారు. దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అనేకమంది దళితులలో ఆత్మ గౌరవాన్ని నింపిందని, ప్రతి నియోజకవర్గంలో 1500 మందికి దళిత బందులో స్థానం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ తెలిపారు. గ్రామాలలోని స్మశాన వాటికలను కులాలకతీతంగా అందరూ వాడుకునేలా అధికారులు ప్రజలలో అవగాహన కల్పించాలని ఎంపీ ఆదేశించారు. కమిటీ సభ్యులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ…
ప్రతినెల 30వ తారీఖున పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల నుండి జరిగే సమావేశాలలో ప్రజాప్రతినిధులను అధికారులను అందరిని ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయిన 35 కేసులకు సంబంధించి రూ. ఒక లక్ష 70 వెలు అందజేయడం జరిగిందని చార్జిషీట్ దాఖలు చేసిన 22 కేసులలో రూ. 3 లక్షల 50 వేలు బాధితులకు అందజేయడం జరిగిందని పెండింగ్ లో ఉన్న వాటికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరి సమానత్వం కోసమే ప్రతి గ్రామంలో వైకుంట ధామాలు ఏర్పాటు చేసామని, అందరు వాటిని వినియోగించు కోవాలని తెలిపారు.
ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ…
ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో ఎలాంటి జాప్యం లేకుండా విచారణ జరిపి కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో హత్య కేసు కిడ్నాప్, రేప్, హర్ట్, తదితర వాటిపై 44 కేసులు నమోదు చేయడం జరిగిందని, వాటిలో కొన్ని కారణాల దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయని మిగతా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ…
ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే కమిటీ సమావేశం ద్వారా దళితుల సాధికారత తదితర అంశాలపై చర్చించే వీలు కలుగుతుందని అన్నారు. గ్రామాలలో దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హద్దులు ఏర్పాటు చేస్తే వారికి ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరు కార్చకుండా పోలీసు అధికారులు విచారణ జరిపి కేసులు నమోదు చేయాలన్నారు బాధితులకు సత్వరం ఎక్స్గ్రేషియా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ…
జిల్లాలో కుల వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో ఇప్పటికే మార్పు వచ్చిందని ఇంకా ఏవైనా గ్రామాలు ఉంటే వాటిలో అధికారులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కేటీ దొడ్డి మండలం ఇరికిచేడులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో జరిగిన కొన్ని అవాంతరాలను అధిగమించి అక్కడ విగ్రహం నెలకొల్పడం జరిగిందని భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చిరువర్గాలను రాజీచేసి సామరస్య పూర్వకంగా కార్యక్రమాలు నిర్వహించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఎస్సీ, ఎస్టీ కేసులు మధ్యవర్తిత్వం నిర్వహించి రాజీ పూర్వకంగా అక్కడికక్కడే సమస్య పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఏ ఎస్ పి రాములు నాయక్ ,ఎస్సీ వెల్ఫేర్ అధికారి శ్వేత ప్రియదర్శిని, వ్యవసాయాధికారి గోవిందు నాయక్, హార్టికల్చర్ అధికారి సురేష్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రమేష్ బాబు, కమిటీ సభ్యులు పెదబాబు, మణిరాజ్, ప్రకాష్, హనుమంతు నాయక్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు