దళితులకే అన్యాయం
– టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్
ఖమ్మం,మే13(జనంసాక్షి): జీవితాలు మెరుగుపడతాయనే ఆశతో దళితులు తెలంగాణ ఉద్యమంలో ఉద్ధృతంగా పాల్గొన్నా, వారికి అన్యయమే జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కువ మోసపోయింది వారేనని అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా దళిత వ్యక్తినే చేస్తామని కేసీఆర్‌ప్రకటించారు, తెలంగాణ వచ్చిన తర్వాత హావిూని విస్మరించారని పేర్కొన్నారు. దళితుడిని సిఎం చేసుకునే వరకు నిద్రపోనని, తల నరుక్కుంటానని కెసిఆర్ అన్నారు. మరి తల నరుక్కున్నారా అని ప్రశ్నించారు. ఇది కెసిఆర్ మాట అంటూ ఆనాడు అందిరనీ మోసపుచ్చారని అన్నారు. కేసీఆర్ పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్టాన్న్రి ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇస్తే అధికారం కెసిఆర్ కుటుంబం అనుభవిస్తోందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను జైల్లో వేస్తే కాంగ్రెస్ పార్టీగా తాము రక్షణగా ఉండి విడిపించామని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ అహంకారంతో వ్యవహరిస్తుందని అదే ఆనాడు కాంగ్రెస్ పార్టీకూడా అదే అహంకారంతో ఉండి ఉంటే తెలంగాణరాష్ట్రం వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలేరు ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల రీ డిజైన్, మిషన్‌భగీరథ పేరుతో దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులను ఎలాగైతే కొనుగోలు చేశారో అదే విధంగా పాలేరు ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. గతంలో రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గోదావరి నీటిని తీసుకోచ్చుందుకు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతుంటే నాడు తుమ్మల నాగేశ్వరరావు అడ్డుకున్నారని గుర్తు చేశారు.పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.ఇదిలావుండగా తెలంగాణలో మానవత్వం లేని శక్తులు అధికారంలో ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తర్వాత పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 30 ఏళ్లు మచ్చ లేకుండా బతికిన నాయకుడు చనిపోతే మర్యాద లేకుండా మాట్లాడటం అధికార పార్టీ నేతలకు సరికాదని పొన్నాల హితవు పలికారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి… మాట్లాడిన వ్యక్తిని ఈరోజు కుడిభుజంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. పాలేరు ప్రజలు తెరాసకు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.