దళితులపై దాడులు వద్దు

2

– ఈ తరహా ఆటవికాన్ని జాతి క్షమించదు

– గోరక్షకులపై కఠినంగా వ్యవహరిస్తాం

– మోదీ

హైదరాబాద్‌,ఆగస్టు 7(జనంసాక్షి): దళితులపై దాడి మానవత్వానికి మచ్చ అని, దళితులపై దాడిచేస్తే జాతి మనల్ని క్షమించదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచం ఒక కుటుంబం అని చెబుతాం, అలాంటి మనం దళితులపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను కాదు తనను కాల్చాలని వ్యాఖ్యానించారు. దళితులను రక్షించడం మన బాధ్యతని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పనులు దళితులకు చేరితే వచ్చే 50 ఏళ్లు ప్రతిపక్షాలు అడ్రెస్‌ లేకుండా పోతాయని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యకర్తల మహాసమ్మేళనంలో మోదీ ప్రసంగించారు.’తెలంగాణకు నా వందనాలు’ అంటూ మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. కొత్తచరిత్రకు హైదరాబాద్‌ ప్రసిద్ధి అని భావిస్తున్నానని అన్నారు. 2013 ఎన్నికల సందర్భంగా ఇదే వేదికపై తాను ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. తన సభకు టికెట్లు కొని వచ్చారని, చరిత్రలో ఓ రాజకీయనాయకుడి సభకు టికెట్‌ కొని రావడం అదే తొలిసారి అని మోదీ చెప్పారు. హైదరాబాద్‌ సభ రాజకీయాలను మలుపుతిప్పిందని అన్నారు.ఈ రోజు తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైందని మోదీ చెప్పారు. ఇక్కడకు వేలసంఖ్యలో వచ్చినవారు ఓటర్లు మాత్రమే కాదని, విూరంతా బీజేపీ జెండా మోసే కార్యకర్తలని, మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలంగాణ భవిష్యత్‌ కనిపిస్తుందని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ అన్నారు. ఒకప్పుడు ఏ పేపర్‌ చూసిన అవినీతి వార్తలు కనిపించేవని, తన ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని చెప్పారు. వ్యవస్థలో దళారులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా అవినీతిరహిత పాలన సాగుతోందని చెప్పారు.ఈ నెల 15 నుంచి సెప్టెంబర్‌  17 వరకు తిరంగాయాత్ర నిర్వహించాలని, ఈ యాత్ర దేశానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మోదీ అన్నారు. దేశమంతా కాషాయ విప్లవం రావాలని, దేశంలో శ్వేత విప్లవం, వ్యవసాయ ఉత్పాదనతో గ్రీన్‌ రివల్యూషన్‌ రావాలని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు దేశ ఆర్థికగతిని మారుస్తుందని చెప్పారు. 120 కోట్లమంది ప్రజలే తనకు హైకమాండ్‌ అని పేర్కొన్నారు. ఉన్నత వర్గాలవారు గ్యాస్‌ సబ్సిడీ వదులుకోవాలని తాను పిలుపునిస్తే, స్పందించి లక్షల మంది సబ్సిడీ వదులుకున్నారని తెలిపారు. దేశంలో 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్‌ కలెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, అనంతకుమార్‌, సురేష్‌ ప్రభు, పియూష్‌ గోయెల్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.