దళితుల సంక్షేమంకోసం తెదేపా పనిచేస్తుంది

– గతంలో వైఎస్‌ దళితులను గాలికి వదిలేశారు
– దళిత మహనీయుల పక్కన వైఎస్‌ విగ్రహాలు పెట్టడం దళితులను అమానించడమే
– మంత్రి నక్కా ఆనంద్‌బాబు
– ‘దళిత తేజం’ ప్రచార రథాలను ప్రారంభించిన మంత్రి
గుంటూరు, జూన్‌28(జ‌నం సాక్షి) : దళితుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. గురువారం ఉదయం దళిత తేజం- తెలుగుదేశం ప్రచార రథాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ పాలనలో దళితుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. వైఎస్‌ హయాంలో సాంఘిక సంక్షేమానికి ఏడాదికి రూ.68 కోట్లు ఖర్చు పెడితే తమ ప్రభుత్వంలో ఒక్కో ఏడాదే రూ.224 కోట్ల ఖర్చు చేశామని తెలిపారు.సంక్షేమ పాఠశాలలో చదివే విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, వారిని ఇంకా అభివృద్ధి చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారని మంత్రి అన్నారు. దళిత జ్యోతి ద్వారా ఉచితంగా దళితుల ఇళ్ళలో వెలుగు నింపామన్నారు. ఎన్టీఆర్‌ విద్యోన్నతి ద్వారా వేలాది మంది దళితులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. దళితులను, దళిత నేతలను వైఎస్‌ పాలనలో అడుగుడున అవమానపర్చారని ఆయన విమర్శించారు. దళిత మహానీయుల విగ్రహాల పక్కన వైఎస్‌ విగ్రహాలు పెట్టడం దళితులను అవమానించడమే అని అన్నారు. దళిత హక్కుల రక్షణ కోసం టీడీపీ ఎంతవరకైనా పోరాటం చేస్తుందని మంత్రి ఆనందబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చిట్టిబాబు, మన్నవ కోటేశ్వరరావు పాల్గొన్నారు.