దళిత, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి: సిపిఐ డిమాండ్
చిత్తూరు,జూన్30(జనం సాక్షి): విజయపురం మండలం క్షురికాపురం దళిత, గిరిజనులుకు ఇచ్చిన పట్టాలుకు తక్షణమే సర్వే చేసి భూమి చూపించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య ప్రభుత్వంను డిమాండ్ చేశారు . శనివారం విజయపురం మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వెంకటరమణకు సీపీఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెంచలయ్య , నగరి నియోజకవర్గం కార్యదర్శి టి . కోదండం మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం దళిత , గిరిజనులకు అడవిలో , కొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చారు , కానీ 9 సంవత్సరాలు గడుస్తున్నా భూమిని పేదలకు చూపించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారని విమర్శించారు . సర్వే నెం. 441 నుండి 450 వరకు క్షురికాపురం అరుంధతివాడ , ఎస్టి కాలనీ , కొత్త హరిజనవాడకు చెందిన 53 మందికి 90 ఎకరాల భూమిని పట్టాలు పంపిణీ చేశారు . అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దళిత తేజం పేరుతో దళిత , గిరిజనులును మోసం చేయడమే తప్ప , న్యాయం చేయడం లేదన్నారు . సర్వే చేసి భూమి చూపించక పోవడం వలన 53 మందికి ఆన్ లైన్ కాలేదని , ఈ పరిస్థితి చూస్తుంటే దళిత , గిరిజనులు భూములను అధికార పార్టీ నాయుకులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చిన పట్టా భూములు సర్వే చేసి సాగుకు సహరించకపోతే ప్రజా ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు . తహసీల్దార్ వెంకటరమణ స్పందిస్తూ తక్షణమే సర్వేయర్ ను పిలిచి సర్వే చేసి భూమి చూపించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో విజయపురం మండల కార్యదర్శి జె . హనుమంతు , ఏ ఐ వై ఎఫ్ నగరి నాయకులు ఎన్ .విజయ్ , జయరామయ్య , మణి , వెంకటయ్య , మునస్వామి తదితరులు పాల్గొన్నారు .