దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలి.
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దళిత జర్నలిస్టులందరికీ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని వర్తింపజేసి అందించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.నిత్యం సమాజ శ్రేయస్సుకోసం పరితపించే జర్నలిస్టులకు ప్రభుత్వం దళిత బంధులో ప్రత్యేక కోటా కేటాయించి దళిత జర్నలిస్టులందరికీ అందించాలని కోరారు.జూన్ మాసంలో హైదరాబాదులో జరిగిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ప్రసంగంలో దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుందని చెప్పారని గుర్తు చేశారు.ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.జర్నలిజంలో ఉన్న దళిత జర్నలిస్టుల కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వాపోయారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఆనాటి టిఆర్ఎస్ అధినేత నేటి సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించిన సీఎం కేసీఆర్ జర్నలిస్టుల స్థితిగతులను అర్థం చేసుకొని దళిత బంధు పథకాన్ని అందించాలన్నారు.లేనిపక్షంలో దళిత జర్నలిస్టుల ఆధ్వర్యంలో త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఆయన వెంట జర్నలిస్ట్ నాయకులు వల్దాస్ ప్రవీణ్, కనుక రవి, మామిడి శ్రావణ్ కుమార్,బిక్షం,చింత సతీష్ ఉన్నారు.