దళిత వ్యతిరేక గాలిలో జగన్‌ కొట్టుకుపోవడం ఖాయం

దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటారు
వైసిసి ప్రభుత్వంపై టిడిపి దళిత మహిళానేతల ఆగ్రహం
అమరావతి,ఆగస్ట్‌10(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను సీఎం జగనే కాదు, రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం అనిత విూడియాతో మాట్లాడుతూ.. దళితులను ఉద్ధరిస్తున్నా మంటున్న వైసీపీ దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు. పోలీసుల అండతో దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌రెడ్డి అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిపై కోవిడ్‌ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి, వైసీపీ బహిరంగ సభలకు కోవిడ్‌ నిబంధనలు గుర్తుకురావా? అని ప్రశ్నించారు. ప్రతిఘటన ర్యాలీని అడ్డు కున్నారంటే దళితులకు న్యాయం చేయలేమని సీఎం జగన్‌రెడ్డి చేతులెత్తేశారా? అని అనిత నిలదీశారు. సీఎం జగన్‌రెడ్డి పోలీసు వ్యవస్థను నిందితులను శిక్షించడానికి కాకుండా టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని అనిత దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత పీతల సుజాత అన్నారు. మంగళవారం సుజాత విూడియాతో మాట్లాడుతూ.. దళితుల పట్ల సీఎం జగన్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్ల వైసీపీ పాలనలో దళితులపై ఎన్నో అక్రమ కేసులు, వేధింపులు పెట్టిందని ధ్వజమెత్తారు. మంగళవారం టీడీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రభుత్వ పిరికి పంద చర్య అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ను వేధించి చంపేశారని పీతల సుజాత అన్నారు. అవినీతిని ప్రశ్నించిన డాక్టర్‌ అనితారాణి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. దళితులకు ఎవరు ఎంత మేలు చేశారో వైసీపీ ప్రభుత్వం చర్యకు రావాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దళితులను ఓటుబ్యాంకుగానే చూస్తున్నారన్నారు. దళితుల పట్ల కక్షసాధింపు ఆపకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని వైసీపీ ప్రభుత్వాన్ని పీతల సుజాత హెచ్చరించారు.