దళీతబస్తీ భూముల పంపిణీలో జిల్లా ముందు
ఆదిలాబాద్,జూన్6(జనం సాక్షి): భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మూడెకరాల చొప్పున నాలుగేళ్లలో 912 కుటుంబాలకు 2,425 ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేసి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ అన్నారు. రైతుబంధు కింద పంట సాగుకు ఆర్థిక సహకారం అందించామన్నారు. స్వయం ఉపాధి పథకం కింద గత సంవత్సరం రూ.5.78 కోట్లతో 433మంది లబ్ధిపొందారని తెలిపారు. జిల్లాలో గొల్ల, కుర్మ కుటుంబాలకు రూ.53.52 కోట్లు ఖర్చు చేసి గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. ఈ గొర్రెల పునరుత్పత్తి , మేతకు 75శాతం సబ్సిడీపై 10లక్షల గడ్డి విత్తనాలను రైతులకు సరఫరా చేశామన్నారు. మత్స్య కుటుంబాలను ఆదుకొనేందుకు మత్స్య అభివృద్ధి పథకం కింద వందశాతం సబ్సిడీతో చెరువులు, రెండు రిజర్వాయర్లలో చేప పిల్లలు విడుదల చేశామన్నారు. మారుమూల ప్రజలకు తాగునీటిని ఇంటింటికీ సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరందించడానికి పనులు త్వరితగతిన జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఆధునిక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై సరఫరా చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన కింద మంజూరైన రూ.280 లక్షలతో 12 మండలాల్లో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా వినియోగించి పంట దిగుబడికి అమలు చేసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా పేదింటి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి, కేసీఆర్ కిట్‌ల పంపిణీతో ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద జిల్లాలో గర్బిణలకు, బాలింతలకు ఒక పూట పౌష్ఠికాహారం అందిస్తున్నామన్నారు. జిల్లాలో రెండు పడక గదుల నిర్మాణం చాలావరకు పూర్తి చేశామని, మిగతావి నిర్మాణ, టెండర్ల దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.