దశాబ్దం గడిచింది రసాయన ఆయుధాలేవి?
30కి పైగా దేశాలతో సద్దాం ఒంటరి పోరాటం
యుద్ధంలో ఓడినా ఇరాక్ గుండెల్లో హీరో
ఇరాక్ యుద్ధానికి పదేళ్లు
బగ్దాద్, (జనంసాక్షి) :
ఇరాక్‌లో మానవ వినాశకర రసాయన ఆయుధాలున్నాయని ఆరోపిస్తూ అగ్రరాజ్యం అక్రమ యుద్ధానికి దిగి దశాబ్దం గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు రసాయన ఆయుధాల జాడమాత్రం కనిపెట్టలేదు. ఇరాక్‌లో భారీ ఎత్తున ఉన్న నాణ్యమైన చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా వాటిని స్వాధీనం చేసుకునేందుకు సాగించిన అరాచక పర్వానికి 30కి పైగా దేశాలు బాసటాగా నిలిచాయి. ఆ కూటమి సాగించిన అరాచక యుద్ధాన్ని సద్దాం ఒక్కడే తన సైన్యంతో సొంతగా ఎదుర్కొన్నాడు. నాటో బలగాలతో విరోచితంగా పోరాడారు. ఇరాక్ సైన్యాన్ని మట్టుబట్టి, అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను ఉరి తీసినా అమెరికా రసాయాన ఆయుధాలు మాత్రం కనిపెట్టలేకపోయింది. 2006 డిసెంబర్ 30న సద్దాంను ఉరితీయించిన అమెరికా సాధించింది ఏమిటి అంటే స్పష్టమైన సమాధానం లేదు. ఇరాక్ యుద్ధం సద్దాం ఉరితీతతో ఆగిపోలేదు. నాటో బలగాలు 2011 డిసెంబర్ వరకు ఇరాక్‌లోనే ఉండి మారణహోమాన్ని సృష్టించాయి. మైనార్టీ వర్గాలు సున్నీ, కుర్దులపై ఆధిపత్యవర్గం షియా తెగలు సాగించిన అరాచకాలకు నాటో బలగాలు వంతపాడాయి. సద్దాంను నియంతగా పోల్చిన అమెరికా తర్వాత తీసుకువచ్చిన ప్రజాస్వామిక ప్రభుత్వమూ అంతకంటే నియంతృత్వ ధోరణులు అనుసరిస్తున్నా గొంతెత్తి ఇదేమిటని ప్రశ్నించలేదు. ఇది కేవలం తన ఆధిపత్యాన్ని ప్రశ్నించిన సద్దాంను హతమార్చేందుకే ఇరాక్ యుద్ధం కోసం అమెరికా 820 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అగ్రరాజ్యం యుద్ధకాంక్ష, పరాయి సొమ్మును అప్పనంగా దిగమింగాలనే తలంపుతో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని విలవిల్లాడింది. అగ్రరాజ్యాన్ని మాంద్యం తాలూకూ దుష్పరిణాలు ఇంకా అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్నాయి. అయినా అమెరికా పాలకుల్లో కించిత్ అయినా పశ్చాతాపం లేదు. తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించేవారికి భూమిపై చోటు లేదని చాటి చెప్పేందుకే అగ్రరాజ్యం ఇప్పటికీ తహతహలాడుతోంది. ఇందుకోసం తమ దేశ ప్రజల ప్రజాస్వామిక హక్కులను పణంగా పెడుతోంది. డబ్బంతా గుమ్మరించి సాగించిన అరాచకపోరాటం తర్వాత ఇరాక్ ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని అగ్రరాజ్యం మొదటి చెప్పుకునే ప్రయత్నం చేసినా ఎదు ఎక్కువకాలం నిలువలేదు. ఇరాక్‌లో మెజార్టీ షియా, మైనార్టీ సున్నీ వర్గాల మధ్య పోరాటం సాగుతూనే ఉంది. అది అంతర్యుద్ధానికి దారితీసినా అగ్రరాజ్యం ప్రేక్షకపాత్ర వహించడం మినహా చేసిందేమి లేదు. అగ్రరాజ్యం దుష్ట విధానాలకు, దుర్నీతికి ఇరాక్‌పై యుద్ధం ఒక ఉదాహరణ మాత్రమే. తీవ్రవాదం పేరిట అమెరిక సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇవేవి ప్రపంచ శాంతిని కోరుకునే ఐక్యరాజ్య సమితికి కనిపించవు. ఎనిమిదేళ్ల పాటు సాగించిన యుద్ధం తర్వాత మీరు కనుగొన్న రసాయన ఆయుధాలేవి అని ప్రపంచ దేశాలు పరోక్షంగా, కొన్ని దేశాలు ప్రత్యక్షంగా ప్రశ్నిస్తున్నా ఐ.రా.స గుంభనంగానే ఉండిపోయింది. అమెరికా సాగిస్తున్న మానవ హక్కుల హననాన్ని ప్రజాస్వామికవాదులు, శాంతికాముకులు మరింత హెచ్చు గొంతుకతో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.