దసరా నుంచి కొత్త జిల్లాల ఆవిర్భావం

5

– జులై 10 లేదా 11న అఖిలపక్షం

– ఆగష్టులో ముసాయిదా

– కలెక్టర్లను దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌

హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి): తెలంగాణలో ఏర్పాటుకానున్న నూతన జిల్లాలు అక్టోబర్‌ 11న విజయదశమి రోజున ఆవిర్భవించనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణను ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10లోపు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. జులై 10 లేదీ 11 తేదీల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.ఈ అంశంపై ఈనెల 20న మరోమారు కలెక్టర్లతో సమావేశ మవుతానని ఆయన పేర్కొన్నారు. ఈలోగా కలెక్టర్లు సమగ్ర నివేదిక అందించాలన్నారు. దానికి సీసీఎల్‌ఏ, సీఎస్‌లు తుది రూపునివ్వాలని ఆదేశించారు. ఈనెల 30లోగా స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రాజకీయ పక్రియ పూర్తి చేయాలన్నారు. అనంతరం జులై 5న కలెక్టర్లతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ముందు కసరత్తు చేసిన తర్వాత.. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించాలని ఆదేశించారు. ఆ తర్వాతే జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ఓ నిర్ణయానికి రావాలన్నారు. ఆ తర్వాత అభ్యంతరాల కోసం ప్రజాప్రకటన ఇద్దామన్నారు. చివరగా నోటిఫికేషన్‌ జారీ అవుతుందని వెల్లడించారు. సుమారు 20 మండలాలతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం ప్రధాన లక్ష్యంగా చేపట్టిన జిల్లాల, మండలాల పునర్విభజన క్రమంలో కొనసాగుతున్న కసరత్తు, పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ప్రజల అవసరాలను, సెంటిమెంట్లను సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు జరగాలని సూచించారు. వ్యక్తుల అభిప్రాయాలు, రాజకీయ కోణంలో కాకుండా ప్రజా క్షేమమే

ధ్యేయంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజన కసరత్తుపై కలెక్టర్ల వద్ద సీఎం ఆరా తీశారు. తెలంగాణ పునర్‌ నిర్మాణంలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన పక్రియను కేవలం జిల్లా విభజనే కాదని, మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను గుర్తించి దగ్గర్లో ఉన్న మండల కేంద్రానికి కలిపే విషయంలో ప్రజాభిప్రాయం తీసుకోవాలన్నారు. ప్రస్తుత జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయం పరిశీలించాలని ఆదేశించారు. నియోజకవర్గంతో పాటు భౌగోళిక పరిస్థితులపై సవిూక్షించాలి, తర్వాతనే పూర్తి స్థాయి మండలాల సంఖ్య అంచనా వేయడానికి సాధ్యమవుతుందన్నారు. 50 నుంచి 60 వేల జనాభాతో మండలాల ఏర్పాటు జరగాలన్నారు. సుమారు 20 మండలాలతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్‌ మండలాలు ఏర్పాటు చేయాలన్నారు. బలవంతంగా తమను ఇతర మండలాల్లో కలిపారన్న భావన ప్రజలకు రాకుండా చూడాలని ఆదేశించారు. పెద్ద మండలాలను రెండుగా చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఒక రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేలా కసరత్తు చేయాలని సూచించారు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు నుంచి ఆరు మండలాలు ఉండేలా కసరత్తు చేయాలన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకే జిల్లాలు, మండలాల పునర్విభజన చేస్తున్నామని తెలిపారు.  మెజార్టీ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి పునర్విభజనపై చర్చ కొనసాగుతోంది. దీంతో 14 లేదా 15 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ కలెక్టర్లకు సూచనలు చేశారు. మండలాల పునర్విభజన పూర్తి స్వేచ్ఛగా జరగాలన్నారు. ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యం కావాలని చెప్పారు. గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయాలు సేకరించాలని తెలిపారు. కొత్త జిల్లాలు అభివృద్ధి సూచికలుగా మారాలని కేసీఆర్‌ సూచించారు. బలవంతంగా మమ్మల్ని వేరేచోట కలిపారన్న మాట రాకూడదని సూచించారు. ఏకపక్ష నిర్ణయలొద్దని చెప్పారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని సూచించారు.  అర్బన్‌ మండలాల్లో లక్షన్నర జనాభా, 20 మండలాలకు ఒక జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 10 నుంచి 12 మండలాలను ఏర్పాటు చేయాలి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 నుంచి 6 మండలాలు ఉంటాయి. మండలాల పుర్విభజన పూర్తి స్వేచ్ఛగా జరగాలని చెప్పారు. పెద్ద మండలాలను రెండుగా విభజించాలని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చక్రవడ్డీ మాదిరి రెట్టింపు అవుతూ అభివృద్ధి వేగం ఆక్సిలరేట్‌ అవుతుందని వ్యాఖ్యానించారు. దైవ కృప వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువగానే తెలంగాణలో అభివృద్ధి సూచి కనిపిస్తుందన్నారు. కాలం ఇదే విధంగా ప్రజలకు అనుకూలంగా కలిపి వస్తే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2019-20 వరకు బడ్జెట్‌ అంచనా రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. ఐదేండ్లకు సహజంగా బడ్జెట్‌ రెట్టింపు అవుతుందన్నారు. అంటే నాలగు లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అయితే అంచనాలకు మించి మరో లక్ష కోట్లు జమ అయి 2024 వరకు ఐదు లక్షల కోట్లకు బడ్జెట్‌ అంచనా వ్యయం చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2024 కల్లా ఐదు లక్షల కోట్లతో ఎంతో రిచ్‌గా ఉంటామని పేర్కొన్నారు. పరిపాలనా ప్రజలకు మరింత చేరువగా వచ్చినప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్‌ విభజన అందులో భాగమేనని తెలిపారు. సాగునీరు విూద యుద్ధం అయిపోతే పేదరికం కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీల్లో ఉన్న ఒక్కొక్క పేద కుటుంబాన్ని టార్గెట్‌ చేసి అభివృద్ధి

చేస్తామని స్పష్టం చేశారు. సిఎస్‌ రాజీవ్‌ శర్మ, మంత్రులు పది జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు.