దాడితో ధైర్యం కోల్పోవద్దు

ప్రధాని మన్మోహన్‌

కాంగ్రెస్‌ నేతల సాహసాన్ని ప్రశంసించిన సోనియా

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

రాయ్‌పూర్‌, మే 26 (జనంసాక్షి) :మావోయిస్టుల దాడితో ప్రజలు ధైర్యం కోల్పోవద్దని ప్రధని మన్మోహన్‌సింగ్‌ ఛత్తీస్‌్‌గఢ్‌ ప్రజలను కోరారు. మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆదివారం పరామర్శించారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది మరణించారు. శనివారం కాంగ్రెస్‌ నేతల క్యాన్వాయ్‌పై బాంబు దాడి చేసి కాల్పులు జరిపిన మావోయిస్టులు సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మ సహా పలువురిని హతమార్చిన విషయం తెలిసిందే. శనివారం వారు అపహరించిన పీసీసీ చీఫ్‌తో పాటు ఆయన కుమారుడు మరో ఏడుగురు మావోయిస్టులు కాల్చిచంపారు. మావోయిస్టుల చేతిలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ప్రధాని సహాయ నిధినుంచి మంజూరు చేయనున్నట్లు మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేలు ఇస్తామన్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్‌పూర్‌లో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికోసం ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొన్నారు. పదకొండు గంటలకు రాయ్‌పూర్‌ చేరుకున్న వీరు అక్కడినుంచి జగదల్‌పూర్‌ వెళ్లి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం రాయ్‌పూర్‌లో సంతాపసభలో మాట్లాడుతూ మావోయిస్టు ఉగ్రవాదంతో పోరాడడంలో మనం మరింత కఠినంగా, మరింత పట్టుదలగా వ్యవహరించాలని ప్రధాని అన్నారు. వారి ప్రాణాలు వృథాగా పోరాదని, తీవ్రవాదం, హింసలతో జరిపే పోరాటానికి ఈ సంఘటన స్ఫూర్తి కావాలని ప్రధాని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతల సాహసాన్ని ప్రశంసిస్తున్నానని సోనియాగాంధీ అన్నారు. దాడి చేసినంత మాత్రాన ధైర్యం కోల్పోమన్నారు. హింసతో సాధించేదేమీ లేదన్నారు. తర్వాత వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు.

దుశ్చర్యను ఖండించిన రాష్ట్రపతి

కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టుల దాడి విషయం తనని తీవ్ర దిగ్భాంతికి లోను చేసిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని, ఈ చర్యను తాను ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. నేరం చేసినవారిని సత్వరం నిర్బంధించి కఠిన శిక్ష విధించాలని ఆయన అధికారులను కోరారు. బాధిత కుటుంబాలకు రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.