దారిపొడవునా విజయమ్మను అడ్డుకోండి

మన నేతన్నల ఆత్మహత్యలకు సీమాంధ్రులే కారణం
తెలంగాణపై వైఖరి చెప్పాకే మన గడ్డపై విజయమ్మ అడుగుపెట్టాలి
వైఖరి చెప్పకుండా వస్తాననడం అప్రజాస్వామికం
తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపర్చడం
రాజకీయ లబ్దికోసమే దీక్ష
అక్రమాస్తులు కాపాడుకోవడం , అదికారం కోసమే ఈ తాపత్రయం
జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
కరీంనగర్‌ జూలై 22 (జనంసాక్షి):
ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా సిరిసిల్ల పర్యటనకు వస్తున్న విజయమ్మను దారి పొడవునా అడ్డుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. విజయ పర్యటనను నిరసిస్తూ ఆదివారం జేఏసీ చేపట్టిన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయమ్మ పర్యటన రాజకీయ లబ్ది కొరకేనన్నారు. వ్యక్తిగతంగా ఆమె సిరిసిల్లకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవనీ, అయితే దీక్షల పేరుతో రాజకీయం చేయాలని చూస్తే సహించబోమని ఆయన తెలిపారు. సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలకు సీమాంధ్ర పాలకులే కారణమన్న ఆయన తెలంగాణపై వైఖరి చెప్పాకే ఆమె ఇక్కడ అడుగుపెట్టాలన్నారు. తెలంగాణపై వైఖరి చెప్పకుండా వస్తామనడం అప్రజాస్వామికన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపర్చడమేనన్న కోదండరాం రాజకీయ
లబ్ది కొరకే విజయమ్మ ఈ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త, కొడుకు అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోవడానికి వారికి అధికారం కావాలని, అందుకే దీక్షల పేరుతో రాజకీయ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణపై విజయమ్మ స్పష్టమైన వైఖరి తెలపాలని లేదంటే ఆమెకు అడ్డంకులు తప్పవని హెచ్చరించారు. విజయమ్మ పర్యటనను అడ్డుకుంటామన్నందుకు పలువురిని అరెస్ట్‌ చేస్తున్నారనీ, ఎంతమందిని అరెస్ట్‌ చేసినా విజయమ్మను అడ్డుకొని తీరుతామన్నారు. దీనిలో భాగంగానే సోమవారం సిరిసిల్ల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ విజయశాంతి, సిరిసిల్ల కేటీఆర్‌లు పాల్గొన్నారు