దిగొచ్చిన మాయావతి..స్పీడ్‌ పోస్టులో పంపిన  బంగ్లా కీస్‌ 

లక్నో,మే31(జ‌నం సాక్షి): ఎట్టకేలకు  ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయవతి దిగివచ్చారు. బంగ్‌ఆ ఖాళీ చేయాల్సిందే నని ప్రభుత్వం అల్టిమేటం ఇవ్వడంతో తన బంగ్లాకు సంబంధించిన తాళాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. బంగ్లాను ఖాళీ చేయాలని తాజాగా యూపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మాజీ సీఎంలకు నోటీసులు ఇచ్చింది. మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌లతో పాటు మరో ముగ్గురు మాజీ సీఎంలకు ఆ నోటీసులు ఇచ్చారు. అయితే లక్నోలో మాయవతి పేరువిూద రెండు బంగ్లాలు ఉన్నాయి. ఒక బంగ్లాను ఆమె కాన్షీరామ్‌ బంగ్లాగా పేర్కొంటూ.. ఆ బిల్డింగ్‌ను వదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే మరో బంగ్లాలో ఆమె సిబ్బంది ఉంటున్నారు. యూపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో ఆ బంగ్లాను ఖాళీ చేసేందుకు మాయావతి అంగీకరించారు. ఆ బిల్డింగ్‌కు చెందిన తాళాలను ఆమె.. బుధవారం స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపారు. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ తాళాలు మరో బిల్డింగ్‌వి అంటూ వ్యాఖ్యానించారు. మాల్‌ అవెన్యూ మార్కెట్‌లో ఉన్న బిల్డింగ్‌ను మాత్రం ఖాళీ చేసేది లేదని మాయావతి స్పష్టం చేశారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.