దిద్దుబాటలో అధిష్టానం

కళంకితులకు ఉద్వాసన!
సీఎం, పీసీసీ చీఫ్‌లతో జోరుగా చర్చలు
తెలంగాణపై తర్జన భర్జన
న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) :
కళంకిత మంత్రుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల తొలగింపుపై కీలకనిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అదే సమయంలో రాష్ట్రంలో భారీ మార్పులు చేస్తే ఎలా ఉంటుందనే విషయంలోనూ తీవ్ర తర్జన భర్జన పడుతోంది. పీసీసీ చీఫ్‌, సీఎం మార్పు, కళంకిత మంత్రుల తొలగింపు, తెలంగాణ వంటి కీలక అంశాలపై హైకమాండ్‌ దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ సహా పలువురు సీనియర్లను ఢిల్లీకి పిలిచిన అధిష్టానం మంతనాలు జరుపుతోంది. సీఎం కిరణ్‌ బుధవారమే రాజధానికి చేరుకోగా, హైకమాండ్‌ పిలుపుతో బొత్స గురువారం ఉదయమే హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్‌ పార్టీ పెద్దలతో రోజంతా చర్చలు కొనసాగించారు. సీనియర్‌ నేత కే.కేశవరావు చాలా కాలం తర్వాత అధినేత్రితో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలకు పైగా చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి దానం నాగేందర్‌కు ఢిల్లీ నుంచి పిలుపురావడంతో ఆయన హుటాహుటిన బయల్దేరారు. తాజా పరిణామాలతో రాష్ట్రంలో కీలక మార్పులే జరగనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌ మార్పు, కేబినెట్‌ ప్రక్షాళనతో పాటు తెలంగాణ అంశంపైనా హైకమాండ్‌ కసరత్తు చేస్తోందని.. త్వరలోనే కీలకమార్పులు జరుగనున్నట్లు సమాచారం.
సీఎంతో ఆజాద్‌ ముమ్మర చర్చలు
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌తో ఉదయం సమావేశమైన ముఖ్యమంత్రి.. పలు అంశాలపై కీలక చర్చలు జరిపినట్లు తెలిసింది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో ప్రధానంగా కళంకిత మంత్రుల తొలగింపుపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ఆరోపణలు రావడంతో కేంద్ర మంత్రి మండలి నుంచి ఇద్దరు మంత్రుల్ని తొలగించిన తరుణంలో రాష్ట్రంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులనూ తొలగించాలని తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయితే, కళంకిత మంత్రులకు సీఎం అండగా నిలబడుతున్నారు. వారిని తొలగిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పదని ఆజాద్‌తో చర్చల సందర్భంగా సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొస్తున్న తరుణంలో ఒకేసారి ఆరుగురు మంత్రులను తొలగించడం వల్ల సమస్యలను కొనితెచ్చుకొన్నట్లేనని అన్నట్లు సమాచారం. ‘ఆరోపణలు వచ్చినంత మాత్రాన తొలగించడం సరికాదు. అలా చేస్తే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది. ఫలితంగా ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తీవ్ర నష్టం జరుగుతుందని’ సీఎం వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయా వర్గాల కథనం మేరకు… కళంకిత మంత్రుల విషయంలో హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా పాటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. అసమ్మతి కార్యకలాపాలపై కిరణ్‌ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ పటిష్టత కోసం తాను కొత్త పథకాలు ప్రకటిస్తే.. ఒకరిద్దరు మంత్రులతో బొత్స దుష్పచ్రారం చేయిస్తున్నారని ఆజాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. పీసీసీ అధ్యక్షుడే స్వయంగా అసమ్మతిని ప్రోత్సహిస్తున్నారని, ఆయనకు చెక్‌ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అసమ్మతి మంత్రులను తొలగించడంతో పాటు మంత్రవర్గ పునర్‌వ్యవస్థీకరణకు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పీసీసీ ప్రక్షాళన చేపట్టాలని విన్నవించారు. అన్నీ విన్న ఆజాద్‌.. తనకు చెప్పినవన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అలాగే, అధినేత్రి వద్ద చర్చించాల్సిన అంశాలపైనా ఇద్దరు చర్చించినట్లు సమాచారం.
బొత్సతో ఆజాద్‌ మంథనాలు
ఆజాద్‌తో కిరణ్‌ భేటీ ముగిసిన అనంతరం పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఆజాద్‌తో సమావేశమయ్యారు. పార్టీ అంశాలతో పాటు ముఖ్యమంత్రి వ్యవహార శైలిపైనా చర్చించారు. సీఎం కిరణ్‌ తీరు వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవని, మంత్రులు, సీనియర్లతో చర్చించకుండానే కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని బొత్స ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీలో చర్చించకుండానే పథకాలు ప్రకటించడం, వాటి సాధ్యాసాధ్యాలపై చర్చ జరగకపోవడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో దూకుడుగా వెళ్తుండడంతో పాటు ఒంటెద్దు పోకడల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. అయితే, ఆయన చెప్పిందంతా విన్న ఆజాద్‌ ఏమాత్రం స్పందించ లేదని తెలిసింది. ఏ క్షణమైనా అధినేత్రి నుంచి పిలుపు వచ్చే అవకాశముందని, అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.