దిల్లీ ఉత్తమ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్
మహిళా ఓటర్లు 50 శాతం ఆప్ వైపే
కిరణ్‌బేడీకి 41.4 శాతం మహిళల మద్దతు
కిరణ్ ఆప్‌లో చేరాల్సింది 44శాతం
బీజేపీలో చేరడం సరైందే 23 శాతం
‘ఏబీపీ-నీల్సన్’ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ,ఫిబ్రవరి1,(జనంసాక్షి): దిల్లీ ఓటర్లు ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాజా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌నే కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు అధికశాతం ఆప్ వైపే చూస్తున్నారు. సీఎంగా కేజ్రీవాల్‌ను కోరుకుంటున్నవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత కిరణ్ బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ ‘స్నాప్ పోల్’లో వెల్లడైంది. ఢీల్లీ సీఎం పదవికి ఉత్తమ అభ్యర్థిగా కేజ్రీవాల్ 47 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇటీవలే బీజేపీలో చేరిన కిరణ్ బేడీ సర్వేలో 44 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. సర్వే ప్రకారం.. మహిళా ఓటర్లలో 50 శాతం మంది కేజ్రీవాల్ వైపు మొగ్గుచూపగా, బేడీకి 41.4 శాతం మాత్రమే మద్దతు తెలిపారు. కిరణ్‌బేడీ ఆప్‌లో చేరి ఉండాల్సిందని 44 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా, బీజేపీలో చేరడమే సరైందని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జనవరి 17 నుంచి 19 తేదీల మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 1,489 మంది పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని జనవరి 11-15 తేదీల మధ్య న్యూస్‌నేషన్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కేజ్రీవాల్‌కు మరింత ప్రజాదరణ దక్కుతుండటం గమనార్హం.