దుర్గంధ భరితంగా మున్సిపల్ సమీకృత మార్కెట్ పరిసరాలు
-పట్టించుకోని అధికారులు
మక్తల్, జూలై 9 (జనంసాక్షి)
మక్తల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ పరిసరప్రాంతాలు దుర్భరంగా మారాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సమీకృత కూరగాయల మార్కెట్ పరిసరాలు దుర్గంధము భరితంతో బురదమయంగా మారినాయి. కూరగాయల మార్కెట్ పక్కనే డ్రైనేజీ ఉండడం పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే ఈగలు, దోమలు విపరీతంగా ఈ ప్రాంతంలో ఉంటున్నాయి. పక్కనే కూరగాయల మార్కెట్ ఉండటంతో ఈగలు, దోమలు అట్టి కూరగాయల పై వాలే అవకాశం లేకపోలేదు. చాలా మంది ప్రజలు కూరగాయల మార్కెట్ ను ఆశ్రయించి నిత్యము కూరగాయలు తీసుకెళ్తుంటారు. దుర్గంధమైన ప్రదేశాన్ని శుభ్రపరచాలన్న ఆలోచన మాత్రం మున్సిపల్ సిబ్బందికి లేకపోవడం శోచనీయమని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలే వర్షాకాలం ఆపై చినుకు పడితే చాలు పరిసర ప్రాంత మంతా చిత్తడిగా మారుతుంది. ఇట్టి విషయం మున్సిపల్ అధికారులకు సైతం తెలిసినప్పటికీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు అనారోగ్య బారిన పడక ముందే మున్సిపల్ అధికారులు సమీకృత కూరగాయల మార్కెట్ పక్కనే గల పరిసరాలన్నీ శుభ్రపరచాలి అని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ప్రజలు రోగాల బారిన పడక తప్పదని అంటున్నారు