‘దేవుళ్లకూ శఠగోపం పెడుతున్న కేసీఆర్’
– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నిర్మల్, జులై2(జనం సాక్షి ) : ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుళ్లకూ శఠగోపం పెడుతున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కుటుంబ సమేతంగా బాసరకు వచ్చిన పొన్నం ప్రభాకర్.. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. కేసీఆర్ బాసర సరస్వతి దేవీ ఆలయాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. బాసర ఆలయాన్ని సందర్శిస్తే పదవి పోతుందని కేసీఆర్ మూఢ నమ్మకంతో ఉన్నారని, ఆ కారణంగానే ఆయన బాసరకు రావడం లేని పొన్నం విమర్శించారు. ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హావిూల అమలులో ప్రజలకు శఠగోపం పెట్టిన కేసీఆర్.. చివరికి దేవుళ్లకూ శఠగోపం పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేఖ పాలన సాగుతుందని, ఏ ఒక్క వర్గానికి కేసీఆర్ ఇచ్చిన హావిూలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతుల జపం చేస్తున్న కేసీఆర్ కేవలం ధనిక రైతులకే మేలు చేకూర్చుతున్నారని, చిన్న, సన్నకారు రైతుల ఇబ్బందులను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎంత పంపిణీ చేశారో చెప్పాలన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 2019 ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
—————-