దేశంలో చమురు మంటలు

ప్రజలకు భారంగా మారిన పెట్రో ధరలు

నాలుగేళ్లుగా ఉపశమన చర్యలు శూన్యం

న్యూఢిల్లీ,మే25(జ‌నంసాక్షి): మోడీ నాలుగేళ్ల పాలనలో చమురు ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్‌ ధరలు మండుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దీంతో తట్టుకోలేని భారం విూద పడింది. దీనిపై సవిూక్ష చేయాల్సిన ప్రభుత్వం ధరలను పెంచుతూ పోతోందే తప్ప పట్టించుకోవడం లేదు. ప్రపంచ మార్కెట్‌లో ఒకవైపు ముడి చమురు ధర తగ్గిపోతున్నా మనకు మాత్రం పెట్రోలు భారం తగ్గడంలేదు. దేశీయ వినియోగదారుడికి ఆ లబ్ధిని బదలాయించక పోవడం ద్వారా దానిని ఆదాయంగా చూసుకోవడం దారుణం కాక మరోటి కాదు. మరోవంక దేశీయ చమురు సంస్థలు సైతం ధరలు పెంచడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుల నడ్డి విరుగుతున్న ఆలోచన చేయకపోవడం అన్నది మోడీ పాలనా వైఫల్యంగానే చూడాలి. జిఎస్టీ పరిధిలోకి పెట్ర వస్తువులను తీసుకుని రావడం ద్వారా తగ్గించే ప్రయత్నాలు చేయకపోవడం అన్నది పాలనాపరమైన వైఫల్యంగానే చూడాలి. ఒకవైపు అంతర్జాతీయ ముడి చమురు ధర తగ్గుతుంటే ప్రభుత్వం ఆ మేరకు పన్ను శాతాన్ని తగ్గించాల్సింది పోయి వంట గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌లపై ధరలనపు పెంచడం విడ్డూరంగా ఉంది. . 2014 నవంబరు 2016 జనవరి మధ్య ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని తొమ్మిదిసార్లు పెంచింది. ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో ప్రభుత్వం సుమారు రూ.2.42 లక్షల కోట్లు ఆర్జించింది. అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్‌ రేటు 2014 మే30నుంచి 2017 ఆగస్టు 3నాటికి 49 శాతం పడిపోయింది. దాని ధర 102.71 డాలర్ల నుంచి 52.16 డాలర్లకు కోసుకుపోయింది. అంతర్జాతీయ ముడి చమురు ధర తగ్గినా దేశీయంగా మాత్రం వంట గ్యాస్‌ ధర 16శాతం పెరగడం దారుణ పరిణామంగా చూడాలి. ఇక పెట్రోల్‌, డీజల్‌ ధరల గురించి చెప్పనే అక్కర్లేదు. మండుతున్న పెట్రో ధరల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రంగంలోకి దిగి చమురు ధరలకు ముకుతాడు

వేయాల్సి ఉంటుంది. ఆర్థిక లోటు లక్ష్యాలను అందుకోలేమన్న భయంతో, పెట్రోల్‌, డీజిల్‌లపై విధించిన ఎక్సైజ్‌ సుంకాలను వెనక్కి తీసుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ విముఖంగా వుంది. పెరుగుతున్న ఇంధన ధరలతో రాజకీయంగా దుమారం రేగడంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఇంధన ధరలను తగ్గించే క్రమంలో ఈ భారాన్ని కొంత ఒఎన్‌జిసి భరించాలని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ ధరలకన్నా తక్కువకే ముడి చమురును విక్రయించాలని ఒఎన్‌జిసిని ఆదేశించాలని పెట్రోలియం శాఖ భావిస్తోంది. ఈ పథకంలో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ భాగం కాబోదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. రిఫైనింగ్‌, మార్కెటింగ్‌ కంపెనీలైన ఐఓసి, హెచ్‌పిసిఎల్‌, బిపిసిఎల్‌లకు దేశ మొత్తం ముడి చమురు అవసరాల్లో 20శాతాన్ని ఒఎన్‌జిసి సరఫరా చేస్తోంది. అయితే ఖచ్చితంగా ధర పరిమితి ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని అధికారి తెలిపారు. రానున్న రెండేళ్ళకు తన ఖర్చులకు సరిపడా నిధుల కోసం అధిక ధరను విధించాలని ఓఎన్‌జిసి ప్రభుత్వాన్ని కోరుతోంది. ఓఎన్‌జిసి ఈ భారాన్ని కొంత పంచుకుంటే ఇటీవల పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మూడవ వంతు తగ్గుతాయని భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. లీటర్‌ పెట్రోల్‌పై 18పైసలు, లీటర్‌ డీజిల్‌పై 23పైసలు డీలర్ల కమిషన్‌లో తగ్గించడం ద్వారా అదనపు ఉపశమనం లభిస్తుంది. ఈ చర్యలు, యంత్రాంగాన్ని అమలు చేయడం వల్ల దాదాపు రు.30వేల కోట్లు ఓఎన్‌జిసి భారం పంచుకున్నట్లవుతుంది. అంటే పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రెండు రూపాయిలు తగ్గించిన దానితో సమానమవుతుంది.