దేశంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి
– ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటేయాలి
– గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడాను గుర్తించండి
– పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
– చంద్రబాబు మన ప్రాజెక్టులకు అడ్డంకి
– కూటమికి అధికారమిస్తే తెలంగాణ మళ్లీ చీకటిమయమవుతుంది
– నాలుగైదేళ్లలో రైతులు ధనవంతులు కావాలి
– పోడు భూములకు ఆరు నెలల్లో పరిష్కారం చూపిస్తా
– ఉత్తమ్ హయాంలో హౌసింగ్‌లో రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది
– ఎవడెవరు ఎంతమింగారో కక్కించి తీరుతాం
– నర్సంపేట సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్
వరంగల్, నవంబర్23(జనంసాక్షి) : దేశంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారని… ప్రజలు మాత్రం సరైన నాయకులను ఎన్నుకోవాలని చెప్పారు. నర్సంపేటలో శుక్రవారం ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ జరిగింది.ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. నర్సంపేట రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతమని అన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా చిల్లరమల్లర రాజకీయం నడుస్తోందన్నారు. తెలంగాణను పాలించింది రెండే పార్టీలన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలని అన్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ పాలన, ప్రస్తుతం నాలుగేళ్ల పాలన చేసిన టీఆర్‌ఎస్ ఏవిధంగా పాలించిందో విూరు చెప్పాలన్నారు. ఎన్నికలు రాగానే నాయకులొస్తారు.. గజకర్ణ, గోకర్ణ అంటూ ఏవేవో చెప్తారన్నారు. నేనే కూడా చెప్తానని, కానీ అర్థం చేసుకోవాల్సింది విూరేనన్నారు. అర్థం చేసుకొని ఓట్లు వేయాల్సింది.. విూరే కనుక ఎవరి పాలన బాగుందో విూరే నిర్ణయించాలన్నారు. కరెంట్ విషయంలో పర్ కేపిటా వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నామనికేసీఆర్ అన్నారు. ఇండియా టుడే వాళ్లు ఇటీవలే తెలంగాణ అవార్డు ఇచ్చారన్నారు. నేను అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు ఉచిత నాణ్యమైన కరెంట్ అందజేస్తానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది ఉత్తమ పథకాలలో రైతు బంధు ఒకటని ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్నారు. మనకు అన్నం పెట్టే
రైతు దురదృష్టవశాత్తూ చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడొద్దని రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 10 పథకాల్లో రైతు బంధు ఒకటి. రైతు భీమాను గుంట భూమి ఉన్న రైతుకు కూడా వర్తింపజేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టి తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. ఆసరా పెన్షన్లు రెట్టింపు చేస్తామని కేసీఆర్ తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్ము కక్కిస్తామని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు ప్రాజెక్టులు వద్దని చంద్రబాబు అంటున్నాడని, అలాంటి చంద్రబాబును కాంగ్రెస్ వాళ్లు మళ్లీ తీసుకొస్తున్నారన్నారు. మానవీయ కోణంలో, మనిషే కేంద్ర బిందువుగా ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. గిరిజన భూములు, గిరిజనేతరుల భూముల సమస్యలకు పరిష్కారం చూపిస్తానన్నారు. దళిత, గిరిజన సోదరులు అభివృద్ది చెందనంత వరకు నాకు సంతృప్తి లేదన్నారు. దళిత, గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హయాంలో హౌసింగ్‌లో రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఎవడెవరు ఎన్ని మింగిరో కక్కించి తీరుతామని,
, ఎవరిని వదిలిపెట్టంమని కేసీఆర్ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో బీడుభూముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తండాలను గ్రామపంచాయితీలుగా చేశామని, దీంతో గిరిజన సోదరులు గ్రామ సర్పంచ్‌లుకానున్నారని తెలిపారు. రిజర్వేషన్లను పెంచాలని కేంద్రంతో కొట్లాడని, అవి కూడా సాధిస్తామన్నారు. నర్సంపేటలో గత ఎన్నికల్లో దయ చూపలేదని, అయినా అన్ని పథకాలు కొనసాగించామని కేసీఆర్ అన్నారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులు కేటాయించామన్నారు. 2001 నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీలో ఉండి కష్టపడుతున్నారని, ఆయనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడన్నారు. ఈసారి సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.