దేశంలో బిజెపి పాలనలో సామాన్య ప్రజానీకం అధోగతి …

జీఎస్టీ పేరుతో సామాన్యుని పై భారం
జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి..
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 12
భారతదేశంలో బిజెపి ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోడీ సామాన్య ప్రజానీకాన్ని, అధోగతి పాలు చేస్తూ కార్పొరేట్ శక్తులకే కొమ్ముకాస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. బుధవారం మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తూ విద్వేషాలను పెంచుతుందని, దేశంలో నిత్యవసర సరుకులైన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకులైన పాలు, పప్పులు, నూనెలు, ఇతర సామాగ్రిపై దిన దినము పన్నులు వేస్తూ రేట్లు పెంచుతుందని, నిత్యవసర సరుకులను సామాన్యులకు అందకుండా బతికే భారంగా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వ హాయంలో ప్రధాని నరేంద్ర మోడీ మొదటి సారి ఎన్నికల హామీల్లోని ప్రధాన హామీ అయిన ఇతర దేశాలలో ఉన్న నల్లధనంతో పేద ప్రజల ఖాతాల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి 15 లక్షలు ఇస్తామని రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నరేంద్ర మోడీ పేదలను భూలోకానికే తొక్కేస్తున్నారే తప్ప, పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. అంబానీ, ఆదాని ఇతర కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ప్రభుత్వము వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో అక్టోబర్ 14 నుండి 18 వరకు జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, ఈ జాతీయ మహాసభలకు ఇతర దేశాల నుండి ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మేధావులు హాజరవుతారని చెప్పారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము సామాన్యులను మోసం చేస్తూ, అధోగతి పాలు చేస్తున్న బిజెపి ప్రభుత్వ తీరుపై, వైఫల్యాలపై 4 రోజులపాటు మహాసభలో ఇతర దేశాధి నేతలతో పాటు, యావత్ భారత దేశంలోని మేధావులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి ప్రజా అవసరాల కోసం పనికివచ్చే పలు అంశాలపై తీర్మానం చేయడం జరుగుతుందని వెల్లడించారు. మహాసభల విజయవంతం కోసం జిల్లా నలుమూలల నుండి మేధావులు విద్యావేత్తలు కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం, ఏఐటిసి నాయకులు దేవునూరి రాజు, కుమార్, కనకం కుమార్, ఐలయ్య, శ్రీనివాస్, పాల్గొన్నారు.