దేశంలో స్వైన్ ఫ్లూ టెర్రర్..

  న్యూఢిల్లీ : స్వైన్‌ ఫ్లూ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మాయదారి మహమ్మారి సామాన్యులపై విషం చిమ్ముతోంది. డేంజరస్‌ డ్రాగన్‌ వైరస్‌ విజృంభనతో జనం ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణ మృదంగాలు వినిపిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లో టెన్షన్ రేపుతోంది. తాజాగా స్వైన్‌ ఫ్లూతో 20 మంది చనిపోవడంతో ఆరోగ్యశాఖ సైతం హైరానా పడుతోంది.
2,064 మంది మృతి..
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు స్వైన్‌ ఫ్లూతో 2 వేల 64 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సుమారు 34 వేల 68 మందిలో హెచ్1ఎన్1 వ్యాధి లక్షణాలున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది కేంద్ర ఆరోగ్యశాఖ తీరు. స్వైన్ ఫ్లూ నివారణకు చర్యలు తీసుకోవాలంటూ అధికారుల్ని సెంట్రల్‌ హెల్త్ మినిస్టర్‌ జేపీ నడ్డా ఆదేశించారు.
గుజరాత్ లో అత్యధికం..
మృతులు అధికంగా ఉన్న రాష్ట్రాల పరంగా చూస్తే గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌లో అత్యధికంగా మృతుల సంఖ్య 432కు చేరింది. సుమారు 6 వేల 514 మంది స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. రాజస్థాన్‌లోనూ ఇదే సీన్‌. ఇప్పటికే 419 మంది మృత్యువాత పడ్డారు. అజ్మీర్‌, నగౌర్‌ ప్రాంతాల్లో రోగులు అవస్థలు పడుతున్నారు. మహారాష్ట్రలో 404 మంది స్వైన్ మహమ్మారికి బలైపోయారు. దాదాపు 4 వేల 574 మంది అవస్థలు పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ స్వైన్‌ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. 300 మంది చనిపోయారు.

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుముఖం..
దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం స్వైన్‌ ఫ్లూ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది.