దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలహాబాద్ 47 డిగ్రీలు, జైసల్మీర్‌లో 46.5, వారణాసి- 45.6, ఢిల్లీ-45.3,అహ్మదాబాద్-43, గోరఖ్‌పూర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలదెబ్బకు… పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి నిర్మానుష్యంగా మారింది. భక్తుల రాక విపరీతంగా తగ్గిపోయింది. గంగానది తీరంలోని ఘాట్‌లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అలహాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలుల దాటవికి జనం బెంబేలెత్తుతున్నారు. సూర్యతాపానికి తాళలేక మాస్కులు, కర్చీఫ్‌లు ధరిస్తూ… ముసుగుదొంగల్లా తిరుగుతున్నారు. ఎండల ధాటికి వడోదరలోని జూలో జంతువులు అల్లాడుతున్నాయి. అధికారులు బోను లోపలా, పైకప్పులపైనా చల్లని నీటితో తడుపుతున్నారు. వడదెబ్బకు దేశవ్యాప్తంగా ప్రజలు మృత్యువాతపడుతున్నారు. మరో మూడు రోజులూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.