దేశాభివృద్ధే లక్ష్యం

– నాలుగేళ్లలో అభివృద్ధి ఉద్యమంలా మారింది
– అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు
– ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ, మే26(జ‌నంసాక్షి) : బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, అభివృద్ధి ఉద్యమంలా మారిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శనివారానికి నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొన్ని ట్వీట్టర్‌ వేధికగా నాలుగేళ్లలో పాలన, జరిగిన అభివృద్ధిపై దేశ ప్రజలకు సందేశాన్ని అందించారు. 2014, మే 26వ తేదీన తాము ప్రభుత్వాన్ని చేపట్టామని, లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి భారత దేశ స్వరూపాన్ని మార్చేందుకు తమ ప్రభుత్వం అనేక అద్భుత కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గత నాలుగేళ్లుగా.. అభివృద్ధి అనేది సామూహిక ఉద్యమంగా మారిందన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి భారతీయుడు భాగస్వామిగా నిలుస్తున్నారని మోదీ ట్వీట్‌ చేశారు. 125 కోట్ల మంది భారత దేశాన్ని ఉన్నత తీరాలకు చేరుస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల సడలని విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న దేశ పౌరులకు శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు, మద్దతు.. తమ ప్రభుత్వానికి ప్రేరణగా, శక్తిగా నిలుస్తున్నాయని ప్రధాని తెలిపారు. అదే అకుంఠిత దీక్షతో ప్రజాసేవకు అంకితమవుతామని మోదీ అన్నారు. మాకు ఎప్పటికీ ఇండియానే ఫస్ట్‌ అని, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజా ఉపయోగకరమైన పథకాలను చేపట్టామని ప్రధాని తెలిపారు.