దేశీయ వైద్య విధానాన్ని మెరుగు పర్చేందుకు చర్యలు తెలంగాణపై చర్చలు
అంత త్వరగా తేలేది కాదు.. ఏకాభిప్రాయం కావాలి
గులాంనబీ పాతపాటే
హైదరాబాద్, అక్టోబర్ 12 (జనంసాక్షి) : దేశీయ వైద్యవిధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెల్త్ ఎగ్జిబిషన్‌ను ఆజాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, కొండ్రు మురళి, జానారెడ్డి దానం నాగేందర్, సారయ్య, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
కేంద్ర మంత్రి ఆజాద్ మాట్లాడుతూ దేశీయ వైద్య విధానంపై ప్రజలకు మంచి విశ్వాసం ఉందని అన్నారు. అలోపతి మాదిరిగానే ఆయుర్వేద, యునాని, హోమియోపతి కోర్సుల్లో కూడా విద్యార్థులు చేరుతున్నారని ఈ కోర్సులకు కూడా ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగిందని అన్నారు. భారత దేశ వైద్య విధానంపై ప్రపంచదేశాల్లో మంచి గుర్తింపు ఉందని అన్నారు. దేశీయ వైద్య విధానానికి రోజు రోజుకు ప్రాధాన్యత పెరగుతుందని ఆయన అన్నారు. అలోపతిలోని ఎం.బి.బిఎస్, నర్సింగ్ కోర్సులకు పోటా పోటీ విరివిగా ఉందని అన్నారు. డాక్టర్ల కొరత కూడా తీవ్రంగాఉందని అన్నారు. దీనిని నివారించేందుకు దేశీయ వైద్యవిధానాన్ని ప్రోత్సహించాలని ఆజాద్ తెలిపారు. దేశీయ వైద్య విధానాన్ని పెంపొందించేందుకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్‌కు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ప్రజలకు ఏ వైద్యంపై నమ్మకం ఉంటుందో దానిని వారు చేపట్టవచ్చునని అన్నారు. దేశీయ వైద్య విధానంపై పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విధానం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండబోదని ఆజాద్ తెలిపారు. దేశీయ వైద్య విధానంపై జరుగుతున్న పరిశోధనలు ప్రజలకు మరింత మేలును చేకూర్చుతాయని అన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వంటి కోర్సుల్లో విద్య అందిస్తున్న కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కళాశాలు కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశీయ వైద్య విధానంతో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని అన్నారు. దేశీయ వైద్య విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు బడ్జెట్లో భారీగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. దేశీయ వైద్య విధానాన్ని తీర్చి దిద్దేందుకు కేంద్రం నుంచి కూడా తగు ప్రోత్సాహం అందుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కోర్సుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, విలేకరులు ఆజాద్‌ను తెలంగాణ గురించి అడుగ్గా ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని పాత పాటే పాడారు.