దేశ ఔన్నత్యాన్ని చాటాలి

సరబ్‌జిత్‌సింగ్‌ విషాదాంతం తర్వాత జమ్మూలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీ ఖైదీ సనావుల్లాపై భారత ఖైదీలు విరుచుపడ్డారు. లాహోర్‌లోని కోట్‌లఖ్‌పత్‌ జైల్లో 22 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సరబ్‌జిత్‌సింగ్‌ను మానవతాదృక్పథంతో విడిచిపెట్టాలని భారత్‌ ఎన్నోమార్లు చేసిన విజ్ఞప్తిని పాక్‌ సర్కారు పెడచెవిన పెట్టింది. ఆయన అమాయకుడని, తెలియనిస్థితిలో సరిహద్దుదాటి పాకిస్తాన్‌ ప్రవేశించాడని అక్కడి మానవ హక్కుల సంఘాలు కూడా ఒప్పుకున్నాయి. కానీ తాను భారత సైన్యం, ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌) నుంచి శిక్షణ పొందానని అతడు ఒప్పుకున్నట్లు చెబుతున్న నేరాంగీకారాన్ని పాక్‌ సర్కారు రికార్డు చేసింది. ఆ రికార్డు ఆధారంగానే పాకిస్తాన్‌ కోర్టు సరబ్‌జిత్‌సింగ్‌కు మరణశిక్షను విధించింది. 22 ఏళ్లు అతడు జైలు అనుభవించాడు. పాక్‌ సర్కారు, విచారణ వ్యవస్థలు అతడి నుంచి సేకరించిన నేరాంగీకార రికార్డు సరైనది కాదని, బలవంతపెట్టి, భయపెట్టి, హింసించి లాహోర్‌ పేలుళ్ల కేసును బలవంతంగా రుద్దారని అక్కడి మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తునే ఉద్యమాలు చేశాయి. సరబ్‌ భారతీయుడు కాబట్టి ఆయన కోసం మన దేశం, మన హక్కుల సంఘాలు పోరాడటం సహజం. కానీ సరబ్‌కు మద్దతుగా పాకిస్తానీ హక్కుల సంఘాలు గొంతెత్తాయి. అయినా ఆదేశం మనసు కరుగలేదు. పర్వేజ్‌ ముషారఫ్‌ ఆయన క్షమాభిక్షను తిరస్కరించారు. చివరికి తోటిఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి శవమై కానీ సరబ్‌జిత్‌ భారత్‌ చేరలేదు. ఆయన్ను ప్రాణాలతో స్వదేశానికి పంపించే అవకాశం ఉన్నా పాక్‌ అందుకు ససేమిరా అంది. ఓ ప్రత్యేక విమానం ఆయన మృతదేహాన్ని మోసుకొచ్చింది. అంతకుముందే యావత్‌ భారతాన్ని విషాదం ముంచెత్తింది. సరబ్‌ తోటి ఖైదీల చేతిలో తీవ్రంగా గాయపడి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా ఆయన సజీవంగా తిరిగిరావాలని ఎంతగానో కోరుకున్నారు. సహజంగానే తాము ఆరాధించే దేవుళ్లనూ ఈమేరకు అభ్యర్థించారు. వారి కోరిక ఫలించలేదు. 22 ఏళ్ల క్రితం తెలిసీ తెలియని స్థితిలో భారత సరిహద్దు దాటిన సరబ్‌ అచేతనస్థితి, శవమై ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగిరావడం అత్యంత విషాదకరమైన అంశం. అదే సమయంలో జమ్మూ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడి చండీఘడ్‌లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్న సనావుల్లా ప్రస్తుతం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని భారత్‌ మానవతా హృదయంతో విడిచిపెట్టాలని పాక్‌తో పాటు భారత్‌లోని పౌరహక్కుల సంఘాల డిమాండ్‌ చేస్తున్నాయి. పాకిస్తాన్‌ ప్రభుత్వమూ సనావుల్లాను విడిచిపెట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. వారి డిమాండ్‌తో భారత ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ గొంతు కలిపాడు. శాంతి సామరస్యం, సంస్కృతి సంప్రదాయాల్లో భారత్‌ ప్రపంచానికి ఆదర్శప్రాయం. అవకాశం వచ్చిన ప్రతిసారి, ప్రతి వేదికపై మన పాలకులు, సాధారణ పౌరులూ ఇదే విషయాన్ని వల్లెవేస్తారు. ఇలాంటి సందర్భంలో మనం మనుషులమని ప్రపంచానికి చాటిచెప్పాలి. పాకిస్తాన్‌లాంటి పాశవిక హృదయం భారత్‌ది కాదని చాటిచెప్పాలి. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సనావుల్లాను తన బంధువులకు అప్పగిస్తే చివరిక్షణాల్లోనైనా వారు వెంట ఉండే అవకాశం కలుగుతుంది. అతడు మృతిచెందే వరకూ మొండిగా ఉండి శవాన్ని అప్పగిస్తే ప్రపంచ దేశాలు, మానవతావాదులు, మానవహక్కుల సంఘాలు పాకిస్తాన్‌ను, భారత్‌ను ఒకే ఘాటన కడుతాయి. ఇది మనం ఎంతమాత్రం జీర్ణించుకోలేని అంశం. చండీఘడ్‌ జైలు అధికారులు బహాటంగా ప్రకటించకపోయినా సనావుల్లా బతికే అవకాశాలు అత్యల్పం. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల్లా ప్రవర్తిస్తే మన ఔన్నత్యాన్ని ఆయన కుటుంబం వేనోళ్ల పొగిడేలా చేస్తుంది. లేకుంటే మనం ఏ విధంగానైతే పాక్‌ సర్కార్‌ తీరును దుయ్యబడుతున్నామో.. దూషిస్తున్నామో… అలాంటి దూషణలే మనమూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచానికి శాంతిమార్గం బోధించినట్లుగా చెప్పుకునే భారత్‌లో ఇప్పుడు అశాంతి హెచ్చుస్థాయిలోనే కనిపిస్తోంది. కళ్లోల కాశ్మీరం, ఈశన్య రాష్ట్రాల్లో రాజ్యం పదఘట్టనల కింద నలుగుతున్న సామాన్యులు, చొరబాట్లతో కవ్వింపులకు పాల్పడుతున్న చైనా, భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో ఆరని కార్చిచ్చు, భారత తీర జలాల్లోకి ఎప్పుడు ఎవరు ఎలా ప్రవేశించి మారణ హోమం సృష్టిస్తారో తెలియని పరిస్థితి. అదే సమయంలో భారత రక్షణ వ్యవస్థనూ పట్టిపీడిస్తున్న అవినీతి భూతం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ ప్రపంచానికి తన శాంతికాముకతను చాటుకోవాలంటే చావుబతుకుల్లో సనావుల్లాను కుటుంబానికి అప్పగించాలి. ఎంతమాత్రం బతికే అవకాశాలు లేని, కనీసం స్పృహలో లేని వ్యక్తిపై, అతడి కుటుంబంపై కరుణ చూపాలి. భారత సర్కారు ఇలాంటి పరిస్థితుల్లో పట్టువిడుపులకు పోతేనే మంచిది. సనావుల్లా ఇప్పటికిప్పుడే లేచివచ్చి దేశంలో విధ్వంసం సృష్టించే పరిస్థితులు కూడా లేవనే విషయాన్ని గుర్తించాలి. విమానాలు హైజాక్‌ చేసి నరహంతుకులను విడిపించుకున్న చరిత్ర పాకిస్తానీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఐఎస్‌ఐది. ఐఎస్‌ఐ శిక్షిత ఉగ్రవాద సంస్థలు భారత్‌లో మారణ హోమాన్ని సృష్టిస్తే దొరికిన వారిని విడిపించుకునేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడింది అందిరికీ తెలుసు. దీనిని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తిపై, అతడి కుటుంబంపై జాలి చూపి మానవత్వాన్ని చాటుకోవాలి.