దేశ విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవుల్లో ప్రత్యక్ష్యం
కొలంబో,జూలై13 (జనంసాక్షి )
: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. మిలిటరీ విమానంలో మాల్దీవులు చేరుకున్నారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకే గొటబాయ రాజపక్స శ్రీలంక నుంచి పారిపోయారని సమాచారం. అరెస్టు చేసే అవకాశం ఉండడంతోనే ఆయన విదేశాలకు పారిపోవాలని నిర్ణయించుకున్నట్టు స్థానిక విూడియా రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనల నేపథ్యంలో బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. కానీ అంతకంటే ముందే లంక విడిచి పారిపోయారు. కాగా జులై 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. బుధవారం ఉదయం మాలే నగరంలోని వెలానా ఎయిర్‌పోర్టులో గొటబాయ రాజపక్సె ప్రత్యక్షమయ్యారు. గొటబాయతోపాటు ఆయన సతీమణి, ఇద్దరు బాడీగార్డులు వెంటవున్నారు. మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధులు గొటబాయకు స్వాగతం పలికారు. మాలేలోని ఎయిర్‌పోర్టులో దిగాక పోలీస్ ఎస్కార్ట్‌తో రహస్య ప్రాంతానికి తరలించారు. మంగళవారం రాత్రి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అధ్యక్షుడు గొటబాయ ఇద్దరు బాడీ గార్డులతో మిలిటరీ విమానం బయలుదేరినట్టు ఆ దేశ రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం రాత్రి విమానం కావాలంటూ అధ్యక్షుడు గొటబాయ తమను కోరారని శ్రీలంక రక్షణశాఖ వర్గాలు వెల్లడిరచాయి. నిబంధనలకు లోబడి విమానాన్ని సిద్ధం చేశామని అధికారులు వివరించారు. శ్రీలంక త్రివిధ దళాలకు అధ్యక్షుడే సుప్రీం కమాండర్‌గా ఉంటారని
వివరించారు. కాగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధ్యక్షుడి పరారీని నిర్దారించింది. గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారని తెలిపింది. మరోవైపు గొటబాయ తమ్ముడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స కూడా దేశం విడిచి పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.