దొంగనుకొని చితకబాదారు

– ప్రాణాలు కోల్పోయిన బాధితుడు
– రాజ్‌కోట్‌లో విషాధ ఘటన
రాజ్‌కోట్‌, మే21(జ‌నం సాక్షి) : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చెత్త ఏరుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిని దొంగ అని భావించి.. తాడుతో కట్టేసి కొట్టారు ఓ ఫ్యాక్టరీ కార్మికులు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం ముకేశ్‌ వనియా అనే వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీ ముందు చెత్త ఏరుకుంటున్నాడు. అయితే పనికిరాని చిన్నచిన్న ఇనుపముక్కల కోసం వారు అయస్కాంతం ఉపయోగించారు. దీంతో దొంగతనానికి వచ్చారని భావించిన ఆ ఫ్యాక్టరీ యజమాని తన సిబ్బందితో వారిపై దాడి చేయించాడు. ఇద్దరు సిబ్బంది ముకేశ్‌ను తాడుతో కట్టేసి రాడ్లతో తీవ్రంగా కొట్టారు. సిబ్బంది దాడి నుంచి తప్పించుకున్న ముకేశ్‌ భార్య సాయం కోసం సవిూపంలోని గ్రామానికి వెళ్లింది. ఆమె తిరిగొచ్చి చూసే సరికి ముకేశ్‌ తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి కన్పించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీ యజమానితో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
కాగా.. ముకేశ్‌ను ఫ్యాక్టరీ సిబ్బంది కొడుతున్న వీడియో ఒకటి సోషల్‌విూడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌ శాసనసభ సభ్యుడు, దళిత నేత జిగ్నేశ్‌ మెవానీ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. గుజరాత్‌లోని ఉనాలో జరిగిన దాని కంటే ఈ ఘటన చాలా దారుణమని పేర్కొన్నారు. గో సంరక్షణ పేరుతో 2016లో ఉనాలో నలుగురు వ్యక్తులను కారుకు కట్టేసి అతి దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే.