` భూవివాదాలపై ప్రత్యేక కమిటీ
` పథకంలో కేంద్ర నిధులపై సీఎం ఆరా..
` భూముల జాబితాపై నివేదిక ఇవ్వండి
` సీసీఎల్‌ఏకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
` అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్యశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి దామోదర రాజ నర్సింహా, రెవిన్యూ, హోసింగ్, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.. ఈ సందర్బంగా సి.ఎం. శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూసంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు. ధరణి ప్రారంభంనుండి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందచేయాలని ముఖ్యమంత్రి సి.ఎస్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో సి.ఎం.ఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా`నవాజ్ ఖాసీం లు పాల్గొనగా, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్ ర్తెవిన్యు అసోసియేషన్ ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడిరచారు.
కాగా ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ధరణి పోర్టల్‌పై సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.83 కోట్లు ఇచ్చిందన్న సీఎం.. ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.నిషేధిత భూముల జాబితా, అసైన్డ్, పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిత్తల్‌ను సీఎం ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని ఈ సందర్భంగా సీఎం అన్నట్టు సమాచారం. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హావిూ ఇచ్చింది. ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ధరణిపై దాదాపు 2గంటల పాటు సవిూక్షించారు.