ధాన్యం కొనుగోలు తీరును తహశీల్దార్లు పర్యవేక్షించాలి.
రాజన్నసిరిసిల్ల బ్యూరో., 05 నవంబర్,5(జనం సాక్షి) ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సందర్షంచి, కొనుగోలు తీరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 258 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ళు సజావుగా సాగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సోమవారం నుండి ధాన్యం మిల్లులకు తరలించాల్సి ఉంటుందని, ప్రతీ కేంద్రానికి ఇప్పటికే గన్నీ బ్యాగులను అందజేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం మిల్లులకు రవాణా చేయడానికి వీలుగా వాహనాలను కూడా కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లాలో ప్రగతిలో ఉన్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల పురోగతిపై ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారులు & భవనాలు, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ అధికారులను అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. రెండు పడక గదుల ఇండ్ల కాలనీల్లో అప్రోచ్ రోడ్లు, నీటి సరఫరా, తదితర పెండింగ్ లో ఉన్న పనులను గుర్తించి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, ఆర్&బి ఈఈ కిషన్ రావు, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్,పర్యవేక్షకులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.