నందకుమార్‌కు తుది వీడ్కోలు

పాల్గొన్న రాహుల్‌

భద్రతా వైఫల్యం నిజమే

కర్మ కుటుంబానికి జడ్‌ ప్లస్‌ భద్రత : రమణ్‌సింగ్‌

ఛత్తీస్‌గఢ్‌ మృతులకు ఏఐసీసీ సంతాపం

రాయ్‌పూర్‌, (జనంసాక్షి) :మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఛత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నందకుమార్‌, ఆయన కుమారుడు దినేశ్‌ అంత్యక్రియలు వారి స్వగ్రామం రాయ్‌గర్‌ జిల్లాలోని నందేలిలో సోమవారం నిర్వహించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు పలువురు వీరి మృతదేహాలకు నివాళులర్పించారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పలువురు కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల అనంతరం సీఎం రమణ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ, శనివారం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడికి భద్రతాలోపాలే కారణమని అంగీకరించాడు. దాడికి గురైన కాంగ్రెస్‌ నాయకులకు తమ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందనే ఆరోపణలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. తాము భద్రత కల్పించినప్పటికీ ఎక్కడో లోపాలు జరిగాయని తెలిపారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించామని, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకొని దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించాయని తెలిపారు. దర్యాప్తు బృందానికి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎస్‌కే సింగ్‌ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. అత్యంత వేగంగా దర్యాప్తు చేసి త్వరగా నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించామని అన్నారు. మావోయిస్టులను కట్టడి చేయడానికి బస్తర్‌ ప్రాంతంలో సైన్యాన్ని దించాల్సిన అవసరం లేదని అన్నారు. మావోయిస్టుల దాడి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైదని ఆయన అభివర్ణించారు. మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, పీసీసీ అధ్యక్షుడు నందకుమార్‌ కుటుంబాలకు జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించామని తెలిపారు. మావోయిస్టుల ఏరివేతకు దండకారణ్యంలో రెండు వేల మందితో కూడిన పోలీసు బలగాలు కూబింగ్‌ నిర్వహిస్తున్నాయని తెలిపారు. బస్తర్‌ నుంచి సుకుమా వరకు విస్తరించి ఉన్న అడవుల్లో ఆరు వందల మంది పారా మిలటరీ బలగాలు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (నక్సల్స్‌ ఆపరేషన్‌) ఆర్‌కే విజ్‌ నేతృత్వంలో కూబింగ్‌ కొనసాగిస్తున్నారు.